
ప్రెస్‌మీట్‌కు వెళ్లకుండా ఎమ్మెల్సీ శివరామిరెడ్డిని అడ్డుకున్న వైనం
ప్రజాస్వామ్య హక్కును కాలరాసేలా వ్యవహరించిన పోలీసులు
వజ్రకరూరు: గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ రామసుబ్బయ్య ఓవరాక్షన్ చేశారు. ప్రెస్‌మీట్‌కు వెళ్లకుండా ఎమ్మెల్సీ శివరామిరెడ్డిని అడ్డుకుని ప్రజాస్వామ్య హక్కును కాలరాసేలా వ్యవహరించారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమీప బంధువు గుమ్మనూరు నారాయణ రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను రెచ్చగొట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సోమవారం ప్రెస్‌మీట్ పెట్టడానికి తన అనుచరులతో కొనకొండ్ల నుంచి గుత్తి పట్టణానికి బయలు దేరారు.
ఈ క్రమంలోనే గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ రామసుబ్బయ్య,వజ్రకరూరు ఎస్‌ఐ నరేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్సీని అడ్డుకున్నారు. ఈ విషయం తెలియడంతో గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసించారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఫోన్‌లో ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డితో మాట్లాడారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పడంతో ఎమ్మెల్సీ శాంతించారు.
ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటాం
అనంతరం అక్కడే ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుల ఆగడాలను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామన్నారు. గుమ్మనూరు నారాయణ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడులను అరికట్టాలని కోరారు. ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సహజమని, గెలుపొందిన వారు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. రాజకీయాలను కేవలం రాజకీయంగా మాత్రమే చూడాలని, ద్వేషాలకు తావివ్వకూడదని సూచించారు.