shiva rami reddy
-
గుంతకల్లు డీఎస్పీ, సీఐ ఓవరాక్షన్
వజ్రకరూరు: గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ రామసుబ్బయ్య ఓవరాక్షన్ చేశారు. ప్రెస్‌మీట్‌కు వెళ్లకుండా ఎమ్మెల్సీ శివరామిరెడ్డిని అడ్డుకుని ప్రజాస్వామ్య హక్కును కాలరాసేలా వ్యవహరించారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమీప బంధువు గుమ్మనూరు నారాయణ రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను రెచ్చగొట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సోమవారం ప్రెస్‌మీట్ పెట్టడానికి తన అనుచరులతో కొనకొండ్ల నుంచి గుత్తి పట్టణానికి బయలు దేరారు. ఈ క్రమంలోనే గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ రామసుబ్బయ్య,వజ్రకరూరు ఎస్ఐ నరేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్సీని అడ్డుకున్నారు. ఈ విషయం తెలియడంతో గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసించారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఫోన్లో ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డితో మాట్లాడారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పడంతో ఎమ్మెల్సీ శాంతించారు.ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటాంఅనంతరం అక్కడే ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుల ఆగడాలను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామన్నారు. గుమ్మనూరు నారాయణ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడులను అరికట్టాలని కోరారు. ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సహజమని, గెలుపొందిన వారు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. రాజకీయాలను కేవలం రాజకీయంగా మాత్రమే చూడాలని, ద్వేషాలకు తావివ్వకూడదని సూచించారు. -
ఓటు..మన గౌరవం యువతా...మేల్కొనండి
‘యువతీ యువకులు బద్ధకం వీడాలి. పోలింగ్ రోజున సరదాగా గడపకుండా...తప్పకుండా ఓటేయాలి. కేటుగాళ్లకు బుద్ధి చెప్పి మంచి వాళ్లను ఎన్నుకోండి. ఈ విషయంలో నిరక్షరాస్యులను చూసి నేర్చుకోండి...’ అంటూ యువతకు పిలుపునిచ్చారు తొలితరం ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(96). కమలాపురం నుంచి 1952లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన నాటి అనుభవాలను మంగళవారం హైదరాబాద్‌లో ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...మా కాలంలో ఓటు వేయడాన్ని గొప్ప గౌరవంగా భావించే వాళ్లం. దీన్ని నేటి యువత కొనసాగించాలి. అప్పట్లోనూ ఎన్నికల బరిలో ఒకరినొకరం విమర్శించుకునే వాళ్లం. అయితే అవన్నీ వ్యక్తిగతంగానే. అసభ్యంగా మాత్రం కాదు. విధానపరమైన అంశాలే ఉండేవి. ఇప్పటి నాయకుల వ్యవహారశైలి..వారి విమర్శలు..మాటలు అసహ్యం కలిగిస్తున్నాయి. నన్ను 1952లో మొదటిసారి సీపీఐ తరపున పోటీకి నిలిపారు. అటువైపు కాంగ్రెస్ అభ్యర్థి రామలింగారెడ్డి. అప్పట్లో కూడా ఫ్యాక్షనిజం, దౌర్జన్యాలు ఉండేవి. అతడేమో ప్యూడల్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. దీంతో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎన్నికల ప్రచారం ఆర్భాటంగానే సాగింది. పెద్ద నాయకులు వచ్చే సభలకు పది గ్రామాల ప్రజలు హాజరయ్యేలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేవాళ్లం. గ్రామ గ్రామాన ప్రతి ఇంటికీ తిరిగి ఓటడిగే వాళ్లం. సుమారు రూ. 8 వేల నుంచి రూ. 10 వేలు వరకూ ఖర్చయింది. పార్టీలు..సిద్ధాంతాలు వేరైనా అందరం కలిసిమెలిసే ఉండేవాళ్లం. నీలం సంజీవరెడ్డితో కలిసి నేను ఒకే కారులో ప్రయాణించిన స్నేహ వాతావరణం ఉండేది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా వ్యవహరించారు. ఆయన హయాంలో ప్రాజెక్టుల కోసం భగీరథ ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ కూడా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి కృషి చేయటం అభినందనీయం. ముఖ్యంగా యువత, ఇప్పుడిప్పుడే ఓటు హక్కు పొందిన వారు ఓటు వేయటం తమ బాధ్యతగా గుర్తించాలి. .:: కోన సుధాకర్ రెడ్డి -
రాజీనామా ఆమోదం
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : డీసీసీ అధ్యక్షుడు మాకం రాజీనామాను పీసీసీ ఆమోదించింది. శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు బొత్స రాజీనామాలు చేసిన అధ్యక్షుల జాబితాను ప్రకటిస్తూ వాటిని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మాకం పేరును రాజీనామా జాబితాలో ధృవీకరించారు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా అప్పటి డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు కూడా పార్టీని వీడారు. ఆ స్థానాన్ని మాకంతో భర్తీ చేశారు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ మాకం ఆరు నెలల కిందట తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను అంగీకరించబోమని ప్రభుత్వ చీఫ్ విప్ శివరామిరెడ్డి, జిల్లాకు వచ్చిన పరిశీలకులు ఇటీవల వెల్లడించారు. అయితే శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల అధ్యక్షుల రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది.