ఓటు..మన గౌరవం యువతా...మేల్కొనండి | Vote Our Right Says Former MLA Siva Rami Reddy | Sakshi
Sakshi News home page

ఓటు..మన గౌరవం యువతా...మేల్కొనండి

Published Wed, Nov 28 2018 8:58 AM | Last Updated on Wed, Nov 28 2018 11:22 AM

Vote Our Right Says Former MLA Siva Rami Reddy - Sakshi

‘యువతీ యువకులు బద్ధకం వీడాలి. పోలింగ్‌ రోజున సరదాగా గడపకుండా...తప్పకుండా ఓటేయాలి. కేటుగాళ్లకు బుద్ధి చెప్పి మంచి వాళ్లను ఎన్నుకోండి. ఈ విషయంలో నిరక్షరాస్యులను చూసి నేర్చుకోండి...’ అంటూ యువతకు పిలుపునిచ్చారు తొలితరం ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(96). కమలాపురం నుంచి 1952లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన నాటి అనుభవాలను మంగళవారం హైదరాబాద్‌లో ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...మా కాలంలో ఓటు వేయడాన్ని గొప్ప గౌరవంగా భావించే వాళ్లం. దీన్ని నేటి యువత కొనసాగించాలి.  అప్పట్లోనూ ఎన్నికల బరిలో ఒకరినొకరం విమర్శించుకునే వాళ్లం. అయితే అవన్నీ వ్యక్తిగతంగానే. అసభ్యంగా మాత్రం కాదు. విధానపరమైన అంశాలే ఉండేవి. ఇప్పటి నాయకుల వ్యవహారశైలి..వారి విమర్శలు..మాటలు అసహ్యం కలిగిస్తున్నాయి. నన్ను 1952లో మొదటిసారి సీపీఐ తరపున పోటీకి నిలిపారు.

అటువైపు కాంగ్రెస్‌ అభ్యర్థి రామలింగారెడ్డి. అప్పట్లో కూడా ఫ్యాక్షనిజం, దౌర్జన్యాలు ఉండేవి. అతడేమో ప్యూడల్‌ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. దీంతో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎన్నికల ప్రచారం ఆర్భాటంగానే సాగింది. పెద్ద నాయకులు వచ్చే సభలకు పది గ్రామాల ప్రజలు హాజరయ్యేలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేవాళ్లం. గ్రామ గ్రామాన ప్రతి ఇంటికీ తిరిగి ఓటడిగే వాళ్లం. సుమారు రూ. 8 వేల నుంచి రూ. 10 వేలు వరకూ ఖర్చయింది. పార్టీలు..సిద్ధాంతాలు వేరైనా అందరం కలిసిమెలిసే ఉండేవాళ్లం. నీలం సంజీవరెడ్డితో కలిసి నేను ఒకే కారులో ప్రయాణించిన స్నేహ వాతావరణం ఉండేది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి  కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా వ్యవహరించారు. ఆయన హయాంలో ప్రాజెక్టుల కోసం భగీరథ ప్రయత్నం చేశారు.  సీఎం కేసీఆర్‌ కూడా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి కృషి చేయటం అభినందనీయం. ముఖ్యంగా యువత, ఇప్పుడిప్పుడే ఓటు హక్కు పొందిన వారు ఓటు వేయటం తమ బాధ్యతగా గుర్తించాలి.  .:: కోన సుధాకర్‌ రెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement