పచ్చ నేతల టెండర్ | - | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల టెండర్

Published Tue, Oct 15 2024 12:52 AM | Last Updated on Tue, Oct 15 2024 1:46 PM

లాటరీ తీస్తున్న కలెక్టర్ వినోద్ కుమార్, చిత్రంలో జేసీ శివనారయణ శర్మ

లాటరీ తీస్తున్న కలెక్టర్ వినోద్ కుమార్, చిత్రంలో జేసీ శివనారయణ శర్మ

అనంతపురం: అనుకున్నట్లే జరిగింది. మద్యం షాపుల టెండర్లలో టీడీపీ నేతలు మాయాజాలం చేశారు. దీంతో దుకాణాల్లో 90 శాతం ‘తమ్ముళ్ల’కే దక్కాయి. ఎంతో ఆశతో దరఖాస్తు చేసి లాటరీ దక్కించుకున్న సామాన్యులను కూడా టీడీపీ నాయకులు బెదిరించి లైసెన్సులు లాక్కున్నారు. జిల్లాలో 136 మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు సోమవారం నగరంలోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు.ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే వ్యవహారాలు నడిచాయి. కూటమి ఎమ్మెల్యేలు తమ సిండికేట్‌ ద్వారా భారీగా దరఖాస్తులు చేయించడంతో ఆడిటోరియంలో వారి అనుచరులు భారీగా తరలివచ్చి తిష్ట వేశారు. ఈ క్రమంలో అధికారులు సహకరించడంతో ‘తమ్ముళ్ల’ దోపిడీకి రాచబాట పరుస్తూ మద్యం దుకాణాల లైసెన్స్‌ల కేటాయింపు పర్వం కొనసాగింది.

ఇష్టారాజ్యంగా బెదిరింపులు..

మద్యం దుకాణం లైసెన్స్‌ దక్కించుకోవడం కాదు కదా.. కనీసం లైసెన్స్‌కు దరఖాస్తు చేసినా అంతు చూస్తాం’ అన్నట్లుగా వ్యవహరించిన ‘తెలుగు తమ్ముళ్లు’ చివరికి లాటరీలోనూ బరితెగించారు. మద్యం షాపుల లైసెన్స్‌ దక్కకపోతే గొడవలు, దాడులకు వ్యూహం పన్నారు. జిల్లాలో అక్కడక్కడా అదృష్టవశాత్తూ మద్యం దుకాణం లైసెన్స్‌ దక్కించుకున్న వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. సిండికేట్‌లో లేకుండా ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామంటూ హెచ్చరికలు చేశారు. మద్యం ఆదాయంలో కమీషన్‌ ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. షాపులు మంజూరైనా పోలీస్‌ కేసులు తప్పవని బెదిరింపులకు దిగారు. దీంతో ఎంతో ఆశతో దరఖాస్తు చేసి, లైసెన్సు దక్కించుకున్న అమాయకులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement