వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలి
అనంతపురం అర్బన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (ఎంవీఆర్‌పీఎస్), రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం (ఆర్‌వీఎస్‌ఎస్) సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులికొండన్న, ఆర్‌వీఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. వాల్మీకి/ బోయల చరిత్ర చాలా గొప్పదన్నారు. పురాతన పద్ధతులు, సంస్కృతి కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నామన్నారు. అటవీ చట్టాల కారణంగా బోయలు అడవిని వదిలి జీవనోపాధికి మైదాన ప్రాంతాల్లోకి వలస వచ్చారన్నారు. రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో వాల్మీకి/ బోయలు ఎస్టీలుగా కొనసాగుతున్నారన్నారు. మిగిలిన జిల్లాల్లో కోస్తా, ముఖ్యంగా రాయలసీమ జిలాల్లో వాల్మీకులు/ బోయలుగా బీసీలుగా ఉండడం దురదృష్టకరమన్నారు. ఇది తమ జాతి అభివృద్ధికి గొడ్డలిపెట్టని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంవీఆర్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.జి.నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి దేవాదుల గోపాల్, ఆర్‌వీఎస్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్లపల్లి మోహన్, స్వర్ణక్క, శివప్రసాద్, సురేభాష్, నాయ్యవాది చంద్రాచర్ల హరి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment