జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
బ్రహసముద్రం : బీఎస్‌ఎఫ్ జవాన్ వడ్డే లక్ష్మన్నకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆర్మీ సిబ్బంది కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. ఢిల్లీ సమీపంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన వడ్డే లక్ష్మన్న (33) భౌతికకాయం ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామం బ్రహ్మసముద్రానికి అధికారులు తీసుకువచ్చారు. కుమారుడిని చూసి తల్లిదండ్రులు సుశీలమ్మ, రామచంద్రప్ప గుండెలవిసేలా రోదించారు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఉదయం జవాన్ భౌతికాయాన్ని ప్రతేక వాహనంలో ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. వందలాది మంది అభిమానుల మధ్య ‘వీరుడా... నీకు వందనం.. అమరుడా లక్ష్మన్నా నీకు వందనం’ అంటూ ఆర్మీ అధికారులు నినదించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి జైజవాన్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పశువైద్యశాల సమీపాన శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బీఎస్‌ఎఫ్ ఎస్‌ఐ మాధవ్‌రావ్, హెడ్‌కానిస్టేబుల్ మాంతేష్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర భద్రత బలగాలు కవాతు నిర్వహించారు. జవాన్ భౌతికకాయంపై ఉన్న జాతీయ జెండాను వారి కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం కుటుంబ సభ్యుల కడసారి వీడ్కోలు అనంతరం ఆర్మీ అధికారులు గౌరవ వందనం సమర్పించి మూడు రౌండ్‌లు గాల్లోకి కాల్పులు జరిపారు. కార్యక్రమంలో సీఐ నీలకంఠేశ్వర్ , తహశీల్దార్ సుమతి, ఎస్ ఐ నారేంద్రకుమార్ , ఆర్ ఐ నాగిరెడ్డి, ఎంపీడీఓ నందకిశోర్, ఎంఈఓ ఓబుళపతి, క్రిష్ణానాయక్, ఎంపీపీ చంద్రశేకర్ రెడ్డి జెడ్పీటీసీ ప్రభవతి రాజకీయ పార్టీల నాయకులు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment