యూట్యూబ్ చానల్ విలేకరి అదృశ్యం
గుంతకల్లు రూరల్: ఇంటి నుంచి పొలానికి ద్విచక్రవాహనంపై బయల్దేరిన యూట్యూబ్ చానల్ విలేకరి బి.తిరుమలరెడ్డి (45) బుగ్గ సంగాల వద్ద అదృశ్యమయ్యాడు. సంఘటన స్థలంలోనే మొబైల్, చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బైక్‌పై బండరాళ్లతో దాడిచేసి ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరో పథకం ప్రకారం దాడిచేసి.. కిడ్నాప్ చేశారా.. లేక హత్య చేసి కాలువలో ఏమైనా పడేశారా అన్నది తెలియడం లేదు. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన బి.వెంకటరెడ్డి కుమారుడైన బి.తిరుమలరెడ్డి కొన్నేళ్లుగా గుంతకల్లుకు వచ్చి నివాసముంటున్నాడు. బుగ్గ సంగమేశ్వర ఆలయ సమీపంలో తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తండ్రి పేరున బీవీఆర్ అనే యూట్యూబ్ చానల్ కూడా నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్య కామేశ్వరి, అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న కూతురు మోనా ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బావమరిదిని చూసేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన తిరుమలరెడ్డి ఆదివారం సాయంత్రం తిరిగి గుంతకల్లుకు చేరుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి పొలానికి పల్సర్ బైక్‌పై బయల్దేరాడు. అయితే మరో ఐదు నిమిషాల్లో పొలానికి చేరుకుంటాడనగా అదృశ్యం అయ్యాడు. బుగ్గ సంగాల వద్ద బండరాళ్లతో బైక్‌ను ధ్వంసం చేసి ఉంది. సమీపంలోనే చెప్పులు, మొబైల్ చెల్లాచెదురుగా పడ్డాయి. అటుగా వెళ్లిన రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటు మద్దికెర, ఇటు గుంతకల్లు నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీనివాస్, గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి తన సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాన్ని రప్పించగా.. సంఘటన స్థలం నుంచి గుట్ట వరకూ వెళ్లి అటు నుంచి పక్కనే ఉన్న హంద్రీ–నీవా కాలువ వద్ద ఆగిపోయింది. తిరుమలరెడ్డిని చంపి కాలువలో పడేశారా లేక, కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా.. దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఏమైనా కాలువలో పడిపోయాడా.. ఇంకేమైనా జరిగిందా.. తిరుమలరెడ్డికి ప్రత్యర్థులు ఎవరు ఉన్నారు.. అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనంపై బండరాళ్లతో దాడి
సంఘటన స్థలంలో దాడి చేసిన ఆనవాళ్లు
కాలువ వరకు వెళ్లి ఆగిన పోలీసు జాగిలం
యూట్యూబ్ చానల్ విలేకరి అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment