11 మందికి ఏఎస్‌ఐలుగా పదోన్నతి
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న 11 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఎస్పీ పి. జగదీష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి తీసుకుని బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్. మధుసూదన్ రావు (శ్రీ సత్యసాయి జిల్లా),జి. నాగరాజు (గుంత కల్లు రూరల్ నుంచి పామిడి), ఆర్. ఉదయభాస్కర రాజు (శ్రీ సత్యసాయి జిల్లా), వై. తిమ్మ రాజు (శింగనమల నుంచి బ్రహ్మసముద్రం), ఎస్. మల్లి రెడ్డి (అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి గార్లదిన్నె), ఎం. సత్యనారాయణ (శ్రీ సత్యసాయి జిల్లా), ఎస్. ఓబులేసు (అనంతపురం వన్‌టౌన్ నుంచి విడపనకల్లు), ఈ. వెంకట రాముడు (శ్రీ సత్యసాయి జిల్లా), ఎం. బాబు నాయక్ (ఆత్మకూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా), ఎం. బాబయ్య (గుంతకల్లు రూరల్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లా), జి. రమేష్ (విడపనకల్లు నుంచి శ్రీ సత్యసాయి జిల్లా).
రేపు ‘దుర్గం’లో
జిల్లాస్థాయి గ్రీవెన్స్
అనంతపురం అర్బన్: కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రజాసమస్యల జిల్లాస్థాయి పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను ఈనెల 25న సోమవారం కళ్యాణదుర్గంలో నిర్వహించనున్నట్లు కార్యక్రమ ఇన్‌చార్జ్ వాణిశ్రీ శనివారం తెలిపారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీతో పాటు ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.
నేటి నుంచి ఉద్యోగుల
క్రికెట్ టోర్నీ
అనంతపురం: ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఉద్యోగుల క్రికెట్ టోర్నీ–2024 ప్రారంభించనున్నట్లు వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ హాజరవుతారని పేర్కొన్నారు. ఎంట్రీలు ఇచ్చిన ప్రతి జట్టు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. నాకౌట్ పద్ధతిలో సెలవు దినాల్లో మాత్రమే మ్యాచ్‌లు జరుగుతాయన్నారు.
అధిక చార్జీలు
వసూలు చేస్తే చర్యలు
అనంతపురం అర్బన్: వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే క్రమంలో డెలివరీ బాయ్స్ అధిక చార్జీలు వసూలు చేయడం చట్టరీత్యా నేరమని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అన్నారు. అలా చేస్తే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేర తీవ్రతను బట్టి ఏజెన్సీ లైసెన్స్ రద్దు చేస్తామని, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జేసీ శనివారం నగర పరిధిలోని ఎర్రనేల కొట్టాలు (ఎంజీకాలనీ) ప్రాంతంలో పర్యటించి దీపం పథకం లబ్ధిదారులతో మాట్లాడారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ సక్రమంగా సరఫరా చేస్తున్నారా అధిక చార్జీలు ఏమైనా వసూలు చేశారా? అని ఆరా తీశారు. గ్యాస్ సరఫరా విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో దీపం–2 పథకం కింద ఇప్పటి వరకు 1,10,942 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.8,92,06,369 జమయ్యిందన్నారు. ఏఎస్‌ఓ జగన్, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment