ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం
● మంత్రి సత్యకుమార్
అనంతపురం టవర్‌క్లాక్: ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి గురించి ఎవరూ భయపడవద్దన్నారు. కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. రాబోయే రోజుల్లో కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి సీట్లు పెంచుతామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపరుస్తామన్నారు. ఎలాంటి రోగానికై నా వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొంతకాలం చికెన్ తినడం మానుకోవాలని సూచించారు. ‘కూటమి’లో ఎటువంటి విభేదాలు లేవని, దీనిపై దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, మాజీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, నాయకులు లలిత్ కుమార్, చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి అనుచరుల ఓవరాక్షన్
విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిధులపై మంత్రి సత్యకుమార్ అనుచరులు ఓవరాక్షన్ చేశారు. ఎంత సేపు ఇంటర్వ్యూ చేస్తారు అంటూ దురుసుగా మాట్లాడారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ఖండించగా.. మంత్రి సత్యకుమార్ క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
సైబర్ మోసాలపై
ఆటోల ద్వారా అవగాహన
అనంతపురం: సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి 70 ఆటోలను జిల్లా ఎస్పీ పి. జగదీష్ శనివారం ప్రారంభించారు. ‘సైబర్ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా ఆటోలు తిరుగుతాయన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎలా వ్యవహరించాలో ఇప్పటికే వాహనాల ద్వారా వీడియోలను ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నామన్నారు. పనుల్లో నిమగ్నమై డిజిటల్ వాహనాల ద్వారా ప్రదర్శించే వీడియోలు చూడలేని వారి కోసం తాజాగా టాంటాం ఆటోలను ప్రవేశపెట్టామన్నారు. జిలా కేంద్రంలో 17 ఆటోలు తిరుగుతాయని, మొత్తం జిల్లా అంతటా 70 ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
కుంభమేళాకు ప్రత్యేక రైలు
రాయదుర్గంటౌన్: ఇది వరకే ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల 22, 25 తేదీల్లో శివమొగ్గ టౌన్ – వారణాసి (06223/06224) కుంభమేళాకు ప్రత్యేక రైలుకు ఆన్‌లైన్ రిజర్వేషన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు 22న శివమొగ్గ టౌన్ నుంచి బయల్దేరి చిత్రదుర్గం, రాయదుర్గం, బళ్లారి కంటోన్మెంట్, హొస్పేట్ మీదుగా ప్రయాగ్‌రాజ్, వారణాసికి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 25న వారణాసిలో బయల్దేరి ఇదే రూట్‌లో రాయదుర్గం మీదుగా శివమొగ్గకు చేరుకుంటుంది. రాయదుర్గం ప్రాంత ప్రజలు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రయాణికుల
భద్రతకు పటిష్ట చర్యలు
గుంతకల్లు: రైలు ప్రయాణికుల భద్రతకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా పేర్కొన్నారు. డివిజన్‌లో తొలిసారిగా ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకోపైలట్ల కోసం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని శనివారం డీఆర్‌ఎం సీఎస్ గుప్తా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైళ్ల రాకపోకలకు సంబంధించిన భద్రతా నిబంధనలు పాటించేందుకు పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ వల్ల సమర్థవంతమైన నిర్వహణతోపాటు భద్రత, ఆపరేషనల్ సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్, సీనియర్ డీఎస్‌టీఈ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ డీఓఎం శ్రావణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం
Comments
Please login to add a commentAdd a comment