బంజారాల పుణ్యభూమి సేవాగఢ్
గుత్తి రూరల్: దేశంలోనే బంజారాల పుణ్యక్షేత్రంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మించిన ప్రదేశం సేవాగఢ్ విరాజిల్లుతోందని వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సేవాగఢ్‌లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను మంత్రి సత్యకుమార్‌యాదవ్, ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు జ్యోతి ప్రజ్వలన చేసి, టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రముఖ గాయకుడు గజల్‌శ్రీనివాస్, సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు కొర్రా జగన్నాథరావు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేశంలో ధర్మం, సమాజాభివృద్ధి, గో సంరక్షణకు పాటు పడ్డారన్నారు. బంజారాల హక్కుల కోసం జల్(నీరు), జమీన్(భూమి), జంగల్ (అడవి) అనే నినాదంతో పోరాడారన్నారు. అంతటి మహానియుడైన సేవాలాల్ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. ఈ సందర్భంగా బంజారా భాషలో గజల్ శ్రీనివాస్ సంగీతం అందించి పాడిన బంజారా శ్రీమద్ భగవద్గీతను మంత్రి ఆవిష్కరించారు. హంపి పీఠాధిపతి విద్యారణ్యస్వామి మాట్లాడుతూ బంజారాలు చెడు వ్యసనాలను వీడి దైవారాధన, సేవా కార్యక్రమాలు చేస్తూ సన్మార్గం వైపు పయనించాలని సూచించారు. ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ దంపతులు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాయక్, ప్రధాన కార్యదర్శి అశ్వత్థనాయక్, సభ్యులు శేఖర్‌నాయక్, హరిలాల్ నాయక్, ఠాగూర్ నాయక్, డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, ఎంపీడీఓ ప్రభాకర్‌నాయక్, తహసీల్దార్ ఓబిలేసు, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment