
ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం
అనంతపురం అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై పోరాటాలు సాగిస్తామని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాసం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వాలు సాగిస్తున్న కుట్రను అడ్డుకుని పథకాన్ని కాపాడాకుంటామన్నారు. అనంతపురంలోని నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల వ్యకాసం అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం మంగళవారం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆవుల శేఖర్‌తో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల్లో మతత్వాన్ని పెంచిపోషిస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. బడ్జెట్‌లో రూ.4.60 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటే రూ.86 వేల కోట్లు మాత్రమే కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవసాయ, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళల హక్కులను నిర్వీర్యం చేయడంతోపాటు పేదలు పోరాడి సాధించుకున్న చట్టాలను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు.
పథకాలు ఎగొట్టేందుకు సీఎం పథకం
ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4 విధానమంటూ సంక్షేమ పథకాలను ఎగొట్టేందుకు పథకం వేశారని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా దాటవేస్తున్నారన్నారు. భూ సమస్యలు, ఉపాధి హమీ, ఇళ్ల స్థలాల సమస్యల సాధనకు పోరాటాలు తప్ప మరో మార్గం లేదని, ఇందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వ్యకాసం రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు తోపు కిష్టప్ప, రాయలసీమ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు రంగయ్య, పెద్దయ్య, నబీరసూల్, భూపేష్, రాధాకృష్ణ, పండుగోలమని, కదిరప్ప, బాలస్వామి, చెన్నరాయుడు, దేవేంద్ర, వెంకట్రామిరెడ్డి, సుందరం, సత్యనారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఉపాఽధి చట్టాన్ని కాపాడుకుంటాం
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్
Comments
Please login to add a commentAdd a comment