ప్రత్యామ్నాయంపై పరిశీలకుల బృందం
అనంతపురం అగ్రికల్చర్: గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగులోకి రావడంతో గత సెప్టెంబర్‌లో ప్రఽత్యామ్నాయ విత్తనాల కింద జిల్లా రైతులకు ఉలవ, పెసర, అలసంద, కొర్ర తదితర వాటిని 80 శాతం రాయితీతో అందించారు. ఇందులో ప్రధానంగా మండలాల వారీగా ఎంత మంది రైతులు ప్రత్యామ్నాయం కింద ఉలవ విత్తనాలు తీసుకున్నారు, వారు విత్తనాలు సాగు చేశారా? పంటలను ఈ–క్రాప్‌లోకి నమోదు చేశారా? తదితర అంశాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి బృందాలు (వెరిఫికేషన్ టీమ్స్) ఏర్పాటు చేస్తూ వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు ప్రత్యామ్నాయం కింద 27 వేల క్వింటాళ్ల విత్తనాలు కేటాయించగా... ఆలస్యంగా పంపిణీ మొదలు పెట్టడంతో 80 శాతం రాయితీతో 10 వేల క్వింటాళ్ల విత్తనాన్ని అందించారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ), అగ్రికల్చర్స్ ఆఫీసర్ల (ఏఓ)తో కూడిన 8 మందితో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు తమకు కేటాయించిన మండలాల్లో పర్యటించి డీ–కృషి యాప్‌లో విత్తన పంపిణీ డేటా ఆధారంగా రాండమ్‌గా 150 మంది రైతులను కలసి వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. డీ–కృషి యాప్, ఈ–క్రాప్ డేటా క్రాస్ చెక్ చేసుకుని 10 ఫార్మాట్ల కింద సమగ్ర నివేదిక సమర్పించాలి. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో పరిశీలనకు అనంతపురం జిల్లాకు చెందిన నలుగురు ఏడీఏలు, నలుగురు ఏఓలతో నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు.
● అనంతపురం జిల్లాలో పరిశీలనకు ఏర్పాటు చేసిన మొదటి బృందంలో పెనుకొండ ఏడీఏ స్వయంప్రభ, హిందూపురం ఏఓ చైతన్యకు అనంతపురం, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, కూడేరు మండలాలు కేటాయించారు. అలాగే రెండో బృందంలో మడకశిర ఏడీఏ కృష్ణమీనన్, మడకశిర ఏఓ ఎలిజిబెత్‌కు కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు మండలాలు, మూడో బృందంలో కదిరి ఏడీఏ ఎస్.సత్యనారాయణ, కొత్తచెరువు ఏఓ ఎం.శ్రీవాణికి బెళుగుప్ప, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకలు, కణేకల్లు మండలాలు, నాలుగో బృందంలో ధర్మవరం ఏడీఏ జి.కృష్ణయ్య, ధర్మవరం ఏఓ మంజులతకు గుత్తి, శింగనమల, యాడికి, నార్పల, రాప్తాడు మండలాలు కేటాయించారు.