
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
గార్లదిన్నె: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఉగాది పండుగ వేళ చోటు చేసుకున్న ఘటనలతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన షేక్షావలి (32) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు.
ఆత్మకూరు: సనప గ్రామానికి చెందిన వినోద్‌కుమార్ (29) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. వినోద్‌కుమార్ అనంతపురంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం తల్లి లక్ష్మీదేవి ఉగాది పండుగ సరుకుల కోసం అనంతపురం వెళ్లింది. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వినోద్‌కుమార్ ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లి తలుపులు తట్టగా లోపల నుంచి స్పందన లేదు. కిటికీలోంచి చూడగా కొడుకు ఉరికి వేలాడూ కనిపించడంతో గట్టిగా కేకలు వేసింది. స్థానికులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి మృతదేహాన్ని కిందకు దింపారు. ఇతడికి వివాహం కాలేదు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.