
సంతోషం.. వెనువెంటే విషాదం!
అసలే నిరుపేద కుటుంబం... రోజూ కూలి పనులకు వెళితేనే పూట గడుస్తుంది... లేకుంటే పస్తులతోనే గడపాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఆ ఇల్లాలికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ సంతోషం ఎంతో సమయం నిలవలేదు. విధి వక్రీకరించడంతో ఉద్యోగం ఆర్డర్ కాపీ అందుకున్న రోజే ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రి పాలైంది. చికిత్స పొందుతూ మృతి చెందింది. పిల్లలు అనాథలయ్యారు.
● ఉద్యోగం ఆర్డర్ కాపీ అందుకుని మృత్యుఒడిలోకి జారిన తల్లి
● మతిస్థిమితం కోల్పోయిన తండ్రి
● అనాథలైన ముగ్గురు చిన్నారులు
గుమ్మఘట్ట: బేలోడు గ్రామానికి చెందిన నడిమింటి తిప్పేస్వామి, రత్నమ్మ దంపతుల రెండవ కుమార్తె జ్యోతి పుట్టుకతోనే అంధురాలు. పదేళ్ల క్రితం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా దొడగట్ట గ్రామానికి చెందిన తిప్పేస్వామితో జ్యోతికి పైళ్లెంది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. భర్త కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సజావుగా సాగిపోతున్న వీరి కాపురానికి గుర్తుగా ప్రతాప్, ప్రకిత, రాజు అనే ముగ్గురు సంతానం కలిగారు.
వికలాంగుల కోటాలో
ప్రభుత్వ ఉద్యోగం
నాలుగు నెలల క్రితం బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో వికలాంగుల కోటా కింద జ్యోతి దరఖాస్తు చేసుకుంది. జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ చేపట్టిన ఇంటర్వ్యూకు హాజరైన ఆమెకు అర్హతే ప్రామాణికంగా బుక్కరాయసముద్రం జంతలూరు వద్ద ఉన్న ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌లో స్వీపర్ పోస్టు దక్కింది. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీని గత నెల 19న అందుకున్న జ్యోతి... ఉన్నఫళంగా కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రాయదుర్గంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు.
సంబరం వెనుకే కన్నీళ్లు...
జ్యోతికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని తెలియగానే ఇటు పుట్టినిల్లుతో పాటు అటు మెట్టినింట్లో సంబరాలు చేసుకున్నారు. ఆరోగ్యం కుదుట పడి విధుల్లో చేరాలని పూజలు చేశారు. నెలకు బేసిక్ రూ.20 వేలు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు కలుపుకుని మొత్తం రూ.30 వేల వరకూ జీతం అందే ఉద్యోగం కావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించారు. అయితే ఈ సంబరం ఎంత కాలమూ నిలవలేదు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 13న ఆమె కన్నుమూసింది. విషయం తెలియగానే భర్త తిప్పేస్వామి ఒక్కసారిగా కుదేలైపోయాడు. తీవ్ర మనోవేదనలో మతిస్థిమితం కోల్పోయి రోడ్డున పడ్డాడు.
తల్లి మృతి, తండ్రి దగ్గర లేకపోవడంతో అనాథలుగా మారిన ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను అమ్మమ్మ రత్నమ్మ చేరదీసింది. అయితే ఆమె కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో పిల్లల పోషణ ఆమెకు భారమైంది. దాతలు ఎవరైనా సహకరించి పిల్లల బాగోగులకు, చదువులకు ఆర్థిక సాయం చేయాలని నిస్సహాయ స్థితిలో రత్నమ్మ వేడుకుంటోంది.
సాయం చేయదలిస్తే...
అనాథలుగా
పిల్లలు

సంతోషం.. వెనువెంటే విషాదం!