మచ్చుకు కొన్ని.... | - | Sakshi
Sakshi News home page

మచ్చుకు కొన్ని....

Published Mon, Apr 7 2025 10:04 AM | Last Updated on Mon, Apr 7 2025 10:32 AM

అనంతపురం అర్బన్‌: కూటమి ప్రభుత్వ ఆదేశాలను ఎమ్మెల్యేలు కనీసంగానూ లెక్క చేయడం లేదు. ‘సర్కారుది ఒకదారైతే... మాది మరోదారి’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా వారికి పట్టడం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలో వెలుగుచూసిన ఓ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ఒక వైపు ప్రభుత్వమేమో రేషన్‌ బండ్ల (ఎండీయూ) ద్వారా బియ్యం, సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశిస్తుంటే.. మరోవైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో ఎండీయూలు తిరగకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. భయంతో కొందరు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

తప్పడు లెక్కలతో నివేదిక..

ఎండీయూలు కదలకుండా ఉంటున్నా.. ప్రతి నెలావాటి ద్వారా రేషన్‌ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వానికి అధికారులు తప్పుడు లెక్కలతో నివేదికలు పంపిస్తున్నట్లు తెలిసింది.జిల్లావ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 405 ఎండీయూలు ఉన్నాయి. వీటిలో 297 వాహనాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు, 27 తాత్కాలికంగా పనిచేస్తున్నట్లు, 81 వాహనాలు పనిచేయడం లేదంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ క్రమంలో ఒక్కో వాహనానికి రూ.21 వేల లెక్కన 324 వాహనాలకు ప్రతి నెలా రూ.68.04 లక్షలు వేతనం కింద విడుదలవుతుండటం గమనార్హం. వాస్తవంగా 405 వాహనాలకు గానూ క్షేత్రస్థాయిలో 30 ఎండీయూలకు మించి పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. దీన్ని బట్టి తిరగని వాహనాలకూ వేతనం చెల్లిస్తుండడం అవినీతిలో మరో కోణం!

● అనంతపురం అర్బన్‌లో 39 ఎండీయూలు ఉంటే 35 పూర్తిస్థాయిలో, ఒకటి తాత్కాలికంగా పనిచేస్తున్నాయని, మూడు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా అనంతపురం అర్బన్‌ పరిధిలో రెండు, మూడు తప్ప మిగిలినవి తిరగడం లేదు. వాటిని కూడా ఒకట్రెండు రోజులు మాత్రమే తిప్పుతున్నారు.

● అనంతపురం రూరల్‌ పరిధిలో 20 ఎండీయూలు ఉంటే 18 పూర్తిస్థాయిలో, ఒకటి తాత్కాలికంగా పనిచేస్తుండగా, ఒకటి పనిచేయడం లేదు. అయితే అధికారుల ఒత్తిడితో రెండు, మూడు వాహనాలు ఒకట్రెండు రోజులు మొక్కుబడిగా తిప్పుతున్నారు.

● గుత్తిలో 16 ఎండీయూలు ఉండగా అన్ని వాహనాలు తిరుగుతున్నట్లు అధికారిక నివేదిక చెబుతోంది. అదే విధంగా పామిడి మండలంలో 11 ఎండీయూలు ఉంటే అన్నీ తిరుగుతున్నట్లు చూపిస్తున్నారు.

● కణేకల్లు మండలంలో 11 వాహనాలు ఉంటే 11 తిరుగుతున్నట్లు, గుమ్మఘట్టలో 10 ఎండీయూలు ఉంటే 10 తిరుగుతున్నట్లు, డి.హీరేహాళ్‌లో 9 ఉంటే అన్నింటి ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కావాల్సినంత నొక్కడానికే...

‘కూటమి’ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలు పాత డీలర్లను తొలగించి తమ పార్టీ వారిని నియమించారు. ఈ క్రమంలో ఎండీయూల ద్వారా అయితే రేషన్‌ సరుకుల నొక్కుడుకు అవకాశం ఉండదనే ఆలోచనతో డీలర్లు అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనం ద్వారా పంపిణీ చేస్తే బియ్యం, కందిపప్పు, చక్కెర నొక్కేసేందుకు వీలుండదు. కోటా మేరకు వాహన నిర్వాహకుడికి సరుకులు అప్పగించాలి. అదే స్టోర్‌ ద్వారా అయితే తూకంలో మోసం చేసి రెండుమూడు కిలోల బియ్యం తక్కువగా, ఇక మిగతా సరుకులు ఇవ్వకుండా మిగుల్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నొక్కుడు కోసమే ఎండీయూల ద్వారా రేషన్‌ పంపిణీ చేయకుండా ఎమ్మెల్యేల ద్వారా అధికారులపై డీలర్లు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ అంశంపై డీఎస్‌ఓ (జిల్లా పౌర సరఫరాల అధికారి) జగన్మోహన్‌ వివరణ తీసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

మచ్చుకు కొన్ని.... 1
1/1

మచ్చుకు కొన్ని....

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement