
వైఎస్సార్‌సీపీ నేత తోటకు నిప్పు
ఉరవకొండ: మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ రైతు విభాగం మండల సహాయ కార్యదర్శి నెట్టెం రామకృష్ణప్ప దానిమ్మ తోటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బాధితుడు తెలిపిన మేరకు.. తనకున్న నాలుగు ఎకరాల్లో 1,300 దానిమ్మ మొక్కలతో సాగు చేపట్టాడు. మరో నెలలో పంట చేతికొస్తుంది. ఈ క్రమంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. చుట్టు పక్కల పొలాల రైతులు గమనించి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. దాదాపు 80 చెట్లు కాలిపోయాయి. ఘటనతో రూ.1.50 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు మేకల సిద్దార్థ్, రాకెట్ల సర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపీటీసీలు శీనానాయక్, శ్రీనివాసులు తదితరులు తోటను పరిశీలించి, బాధితుడిని ఓదార్చారు.