
జిల్లాకు వర్షసూచన
బుక్కరాయసముద్రం: ఉమ్మడి జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 40.2–41.3, రాత్రి 23.9–24.7 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చన్నారు.
రూ.2.91 కోట్ల పంట నష్టం
అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా సోమవారం సాయంత్రం రూ.2.91 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, అనంతపురం, యల్లనూరు, ఉరవకొండ, కూడేరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుమ్మఘట్ట, గుంతకల్లు, పెద్దవడుగూరు మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో అరటి, మామిడి, బొప్పాయి, కళింగర, మునగ తదితర పంటలు 95 హెక్టార్లలో దెబ్బతినడంతో 115 మంది రైతులకు రూ.1.50 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే, శింగనమల, నార్పల, గార్లదిన్నె, కంబదూరు, బెళుగుప్ప మండలాల్లో 173 హెక్టార్లలో మొక్కజొన్న, వరి, పత్తి పంటలు దెబ్బతినడంతో 92 మంది రైతులకు రూ.1.41 కోట్ల నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.
మెట్ట భూముల సాగుకు తోడ్పాటు : డ్వామా పీడీ
అనంతపురం టౌన్: మెట్ట భూముల్లో మామిడి, నిమ్మ, జామ, బత్తాయి, సపోటా తదితరాలు సాగు చేసేవారికి ఉపాధి హామీ పథకం ద్వారా తోడ్పాటునందిస్తామని డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 8 వేల ఎకరాల మెట్టభూముల్లో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఐదు ఎకరాల్లోపు మెట్ట భూములున్న రైతులు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది మామిడి, చీనీ, దానిమ్మ, నిమ్మ, జామ, అల్లనేరుడు, డ్రాగన్ ఫ్రూట్, సపోట, అంజూర సాగుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. రైతులే మొక్కలను కొనుగోలు చేసుకుంటే వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. ఎకరా లోపు పొలం ఉన్న రైతులు సైతం మునగ, పూల మొక్కల సాగుకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
అక్రమాలకు పాల్పడొద్దు
అనంతపురం అర్బన్: పింఛన్ల పంపిణీలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పింఛను లబ్ధిదారులతో గౌరవంగా మాట్లాడాలన్నారు. డీఆర్‌ఈఏ పీడీ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.