
సంక్షోభంలో రవాణా రంగం
హిందూపురం అర్బన్: లారీ రవాణా రంగం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. రాష్ట్రంలో విజయవాడ తరువాత పదేళ్ల క్రితం వరకూ హిందూపురం రవాణా రంగంలో రెండో స్థానంలో ఉండేది. డీజిల్ ధరలు పెరగడం.. టోల్ గేట్ల మోత.. లోడింగ్– అన్‌లోడింగ్‌ల ఖర్చు, జీఎస్‌టీల భారంతో కనీస ఖర్చులు కూడా చేతికి అందడం లేదని లారీ యజమానులు వాపోతున్నారు.
ఉన్నవి నడపడమే గగనం
గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 12వేలకు పైగా లారీలు ఉండేవి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, నాగపూర్, కొలకత్తా, చైన్నె, కొచ్చికి ఇక్కడి నుంచి సరుకు ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా జరిగేవి. దీంతో పదేళ్ల క్రితం వరకు లారీల నిర్వాహకులకు ఆదాయం బాగుండేది. ఈ క్రమంలో చాలా మంది ఫైనాన్స్ కింద లారీలు కొనుగోలు చేసి సరుకు రవాణా రంగంలో స్థిరపడ్డారు. కాలక్రమేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరుల కారణంగా సరుకు రవాణా వ్యవస్థ కుదేలవుతోంది. కొత్తగా లారీలు కొనుగోలు చేసేవారి సంగతి పక్కన ఉంచితే... ఉన్నవాటిని నడపడమే గగనంగా మారుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 వేల వరకు లారీలు ఉన్నాయి.
కాలం మారినా అవే బాడుగలు
రవాణా రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా ఐదారేళ్ల క్రితం ఉన్న కిరాయినే ఇప్పటికీ ఉంది. లోడింగ్‌లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సీజన్‌లో కాస్త మెరుగనిపించినా ఆ తర్వాత లారీలన్నీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం ఎదుటే ఉంటున్నాయి. సరుకు రవాణాకు ఇప్పుడు రైళ్లను ఎక్కువగా ఎంచుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
పెరిగిన ఇన్సూరెన్స్, పన్నులు
లారీ విలువను బట్టి రెండేళ్ల క్రితం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు బీమా ప్రీమియంను యజమానులు చెల్లించేవారు. ఇప్పుడు ఇదే ప్రీమియం రూ.40 వేల నుంచి రూ.75 వేల వరకు చేరింది. 22 చక్రాల కొత్త లారీకి ఇన్సూరెన్స్ కింద రూ.1.25 లక్షల ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. అలాగే లారీని బట్టి మూడు నెలలకు ఒకసారి స్టేట్ పర్మిట్ కింద పన్ను రూ.8 వేల నుంచి 13 వేల వరకు చెల్లించాలి. నేషనల్ పర్మిట్ అయితే మరింత ఎక్కువవుతుంది. ఇక ఏడేళ్లు దాటిన లారీలకు పన్నులకు అదనంగా గ్రీన్ ట్యాక్స్ తప్పక చెల్లించాల్సి వస్తోంది.
పెరిగిన ఇంధనం, టైర్లు, విడి పరికరాల ధరలు
కూలీలతో లోడింగ్, అన్‌లోడింగ్ కష్టాలు
ఈఎంఐలు కట్టలేక రోడ్డు మీద
పడే దుస్థితి
రేపటి నుంచి కర్ణాటకకు నో ఎంట్రీ
పెరిగిన విడిభాగాల ధరలు
ఇంజన్ ఆయిల్‌తో పాటు లారీల విడిభాగాల ధరలు దాదాపు 22 శాతం మేర పెంచారు. దీంతో లారీ సామర్థ్యాన్ని బట్టి నెలవారీ నిర్వహణ ఖర్చు రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు వస్తోంది. టైర్ల ధరలు మూడేళ్ల క్రితం రూ.16,500 ఉంటే ఇప్పుడు అవే టైర్లు రూ.21,500కు చేరుకున్నాయి. రేడియల్ టైర్లయితే రూ.26వేలు ఖర్చవుతోంది. రోడ్డుపై లారీ తీసిన ప్రతిసారీ పోలీస్, రవాణా అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోంది.
మోయలేని ఆర్థిక భారం
రవాణా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నాలుగు శాతం వ్యాట్ తగ్గించాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే దీని ధర ఎక్కువ. విడి భాగాల ధరలు సైతం అందుబాటులో లేవు. అంతేకాక కొందరిని నమ్మి లారీలు అప్పజెప్పే కాలమూ పోయింది. ఓనర్లే తిప్పడమో లేదా డ్రైవర్‌తో పాటు వెళ్లడం చేస్తున్నారు. జీఎస్టీతో యజమానులపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. వీటిని తగ్తిస్తే ఎంతో వెసులుబాటుగా ఉంటుంది.
– షేక్ ఇందాద్, హిందూపురం
లారీ అసోసియేషన్ అధ్యక్షుడు
గ్రీన్ ట్యాక్స్ పేరుతో బాదుడు
10 ఏళ్ల క్రితం లీటర్ డీజిల్ ధర రూ.68 ఉండేది. అప్పట్లో విజయవాడకు టన్ను సరకు రవాణాకు రూ.1,600 ఇచ్చేవారు. అంటే లారీకి 15 టన్నులు వేసినా రూ.24 వేలు వచ్చేది. రానూపోను రూ.48 వేలు దక్కితే ఖర్చులు పోను రూ.15వేలు మిగిలేది. ఇప్పుడు లీటరు డీజిల్ రూ.100కు చేరువలో ఉంది. విజయవాడకు కిరాయి టన్నుకు రూ.14 వేలు ఇస్తున్నారు. ఈ లెక్కన రానూపోను రూ.42 వేలు వస్తుంది. ఖర్చులన్నీ పోనూ యజమానికి మిగిలిదే ఏదీ ఉండదు. దీనికి తోడు గ్రీన్‌ట్యాక్స్‌ను అమాంతం పెంచేశారు.
– షౌకత్ అలీఖాన్, లారీ ఓనర్, హిందూపురం
ప్రజా జీవితంలో రవాణా రంగం కీలక భూమిక పోషిస్తోంది. ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. రకరకాల పన్నుల పేరుతో అధిక మొత్తంలో నగదు వసూళ్లతో రవాణా రంగం కుదేలవుతోంది.
15 నుంచి కర్ణాటకకు లారీల బంద్
రవాణా రంగాన్ని కలవర పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు నిరసనగా ఈ నెల 14న అర్ధరాత్రి నుంచి రవాణా కార్యకలాపాలు విరమించాలని ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ లారీ ఓనర్స్, ఏజెంట్స్ అసోషియేషన్ నిర్ణయించింది. ఇందుకు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. లీటర్ డీజల్‌పై రూ. 5 అదనంగా పెంచడం, టోల్‌గేట్ల వద్ద బలవంతపు వసూళ్లు, బెంగళూరులో అశాసీ్త్రయమైన నో ఎంట్రీ నిబంధనలు, అప్పు కింద కొనుగోలు చేసిన లారీ యజమానులపై ఫైనాన్స్ వారి వేధింపులు.. తదితరాలను నిరసిస్తూ కర్ణాటక లారీ అసోసియేషన్ ఈ మేరకు ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీంతో ఈ నెల 15 నుంచి కర్ణాటకకు లారీల రాకపోకలు నిలిపివేయనున్నారు.

సంక్షోభంలో రవాణా రంగం