
ప్రాణం పోసిన మెడిసిన్ వైద్యులు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో చికిత్స ఆస్పత్రికి చేరుకున్న రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా అతని ప్రాణాలను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మెడిసిన్ విభాగం వైద్యులు కాపాడారు. కంబదూరు మండలం ఒంటిరెడ్డిపల్లికి చెందిన 34 ఏళ్ల వయసున్న నాగేంద్ర.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉన్నఫళంగా కాళ్లు చేతులు పడిపోయి, మాట రాకపోవడంతో ఈ నెల 7న కుటుంబసభ్యులు సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అక్యూట్ మెడికల్ కేర్‌లో అడ్మిట్ చేసుకుని మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ భీమసేనాచార్ నేతృత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పావని తదితరులు చికిత్స మొదలు పెట్టారు. గులియన్ బరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ అయిన తర్వాత పీజీ వైద్యులు, స్టాఫ్‌నర్సులు నాగేంద్రకు రౌండ్ ద క్లాక్ సేవలందించారు. రూ.7వేలు విలువ చేసే ఇంజెక్షన్లను క్రమం తప్పకుండా 20కి పైగా అందించాల్సి వచ్చింది. వెంటిలేటర్‌పై ఉన్న నాగేంద్ర కోలుకోవడంతో వార్డుకు షిప్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తమకు ముగ్గురు పిల్లలున్నారని, ఆస్పత్రి వైద్యులు తన భర్తకు ఊపిరి పోశారని, వారి మేలును ఎన్నడూ మరవనంటూ వైద్యులు, స్టాఫ్‌నర్సులు, తదితర సిబ్బందికి భార్య సుకన్య కృతజ్ఞతలు తెలిపింది. ప్రైవేట్‌గా ఈ తరహా వైద్యం పొందాలంటే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వైద్యులంటున్నారు.