
19న వివాహం... యువతి బలవన్మరణం
రాప్తాడు రూరల్: పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట కాబోయే పెళ్లికూతురు బలవన్మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం రూరల్ మండలం పూలకుంటలో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన మేరకు... పూలకుంట గ్రామానికి చెందిన కురుబ నారాయణస్వామికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పెద్దమ్మాయికి వివాహమైంది. రెండో అమ్మాయి రేణుక (24) ఆకుతోటపల్లి–1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. ఈమెకు ఓ ప్రభుత్వ ఉద్యోగితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 19న పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు ఓవైపు పెళ్లి పత్రికల పంపిణీ చేస్తూనే మరోవైపు పెళ్లికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటికి బంధువుల రాక కూడా మొదలైంది.
పెళ్లంటే ఇష్టం లేక....
అయితే రేణుకకు పెళ్లంటే ఇష్టం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు సచివాలయంలో సహచర ఉద్యోగులతో చెప్పేది. ‘పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుందో...అత్త మామలు ఎలా ఉంటారో....ఇప్పుడున్నట్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఉండేందుకు ఉండదు... కొత్తగా పెళ్లి చేసుకున్న వారి కాపురాలు చాలా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు చేసుకోవాలో?’ అని చర్చించేది. మరోవైపు పెళ్లి తేదీ దగ్గరకు వస్తుండడంతో హడావుడి పెరిగిపోయింది. ఇక పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని, తల్లిదండ్రులకు చెప్పుకోలేక తీవ్ర ఆందోళనకు గురైన ఆమె సోమవారం ఉదయం మేడపై ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఎంతసేపటికీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పైకి వెళ్లి చూడగా ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తె కనిపించింది. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట విషాదం
మృతురాలు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్