
యువ కౌలు రైతు ఆత్మహత్య
నార్పల: కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు... స్థానిక సుల్తాన్‌పేటకు చెందిన నాగభూషణం కుమారుడు కురువ చరణ్ (23) మామిడి తోటలను కౌలుకు తీసుకొనేవాడు. అలా ఈ ఏడాది తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకుని దాదాపు 15 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. పంట బాగా వచ్చేందుకు పురుగు మందులు కొట్టడంతో పాటు కూలీలతో ఇతర పనులు చేయించాడు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో పంట సరిగా రాలేదు. దీనికితోడు దళారుల మోసంతో మామిడికి సరైన ధరలు కూడా దక్కలేదు. దీంతో దాదాపు రూ.20 లక్షల నష్టం వచ్చింది. ఈ క్రమంలో అప్పులు కట్టే దారి కానరాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చరణ్ జంగంరెడ్డిపల్లి వద్ద తాను కౌలుకు తీసుకున్న మామిడితోటలో సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల రైతుల వారు వెంటనే అతడిని జల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స ఫలించక ప్రాణాలు విడిచాడు. చరణ్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.