
ఆర్టీసీ ఆదాయానికి ‘ప్రైవేటు’ గండి
ఉరవకొండ: ప్రైవేట్ వాహనాల దెబ్బతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. అధికార పార్టీ అండదండలతో ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ప్రయాణికులను చేరవేస్తున్నారు. ఉరవకొండ ఆర్టీసీ డిపోలో సూపర్ లగ్జరీ–4, అల్ట్రా డీలక్స్–4, ఎక్స్‌ప్రెస్–7 ఆర్డినరీ –44 చొప్పున మొత్తం 59 బస్ సర్వీసులు ఉన్నాయి. రోజూ 21వేల కిలోమీటర్లు తిరుగుతూ 20 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుండేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది.
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
అధికార టీడీపీ నాయకులతో ప్రైవేట్ ఆపరేటర్లు ఒప్పందం కుదుర్చుకుని ఏడు సీట్ల సామర్థ్యం కలిగిన 10 ఎర్టిగా కార్లను కొనుగోలు చేశారు. వీటిని ఉరవకొండ – అనంతపురానికి 8 సింగిల్స్ తిప్పుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా ఉరవకొండ నుంచి అనంతపురానికి ఆర్టీసీ బస్సులో టిక్కెట్ ధర రూ.85 ఉంది. ఎర్టిగా వాహనంలో ఒక్కొక్కరికి వంద రూపాయల చార్జీ వసూలు చేస్తున్నారు. చిన్న, పెద్ద అందరికీ ఇదే ధర వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను తరలించాలంటే ఎల్లో బోర్డు ఉండాలి. అయితే వైట్‌బోర్డు కలిగిన వాహనంలోనే యథేచ్ఛగా తరలించేస్తున్నారు. అంతేకాదు పెట్రోలుతో నడిచే ఈ వాహనాలను ఆపరేటర్లు ఆదాయం కోసం గ్యాస్ సిలిండర్లను అమర్చుకుని తిప్పుతున్నారు. నాన్‌స్టాప్ కావడం, సమయం కలిసి రావడంతో ధర ఎక్కువైనా కొందరు ప్రయాణికులు వీటిలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రైవేట్ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా తిప్పడం వల్ల ఆర్టీసీ ఆదాయానికి నెలకు రూ.2.50 లక్షల దాకా కోత పడుతోంది. ఎక్కడైనా అధికారులు పట్టుకుంటే తమ పేరు చెప్పాలని టీడీపీ నాయకులు చెప్పడంతో ప్రైవేట్ ఆపరేటర్లు రెచ్చిపోతున్నారు. ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డిపో ఎదుటే ప్రైవేట్ వాహనాల హల్‌చల్
ఆర్టీసీ ప్రయాణికులను ఎక్కించుకుంటున్న వైనం
టీడీపీ నాయకుల అండతో నిబంధనల ఉల్లంఘన
ప్రైవేట్ వాహనాలను కట్టడి చేస్తాం
ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ప్రైవేట్ వాహనాలను కట్టడి చేస్తాం. ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఉరవకొండ డిపో నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేలా కృషి చేస్తాం.
– హంపన్న, డిపో మేనేజర్, ఉరవకొండ
ఆ వాహనాలను సీజ్ చేస్తాం
ఉరవకొండ ఆర్టీసీ డిపో వద్దనే ప్రైవేట్ వాహనాలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. వైట్ బోర్డులు పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఏడు నుంచి ఎనిమిది మందిని ఒకే వాహనంలో తీసుకెళ్తూ ఆర్టీసీకి నష్టం కల్గిస్తున్నారు. త్వరలోనే దాడులు నిర్వహించి ఆ వాహనాలను సీజ్ చేస్తాం.
– రాజాబాబు, ఆర్టీఓ, గుంతకల్లు