
రాజధాని పేరిట మభ్యపెడుతున్న బాబు
అనంతపురం కార్పొరేషన్: అమరావతి పేరిట సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష ఎకరాలు, రూ.లక్ష కోట్లతో అమరావతిని నిర్మిస్తామని, రెండో సారి భూమి పూజకు ప్రధాని మోదీని పిలుస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండటం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి అంటే కేవలం అమరావతి మాత్రమే కాదని, అన్ని జిల్లాలను పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే 53 వేల ఎకరాలను సేకరించింది కాక తాజాగా మరో 43 వేల ఎకరాలను సేకరించాల్సి ఉందని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ చెప్పడం అన్యాయమన్నారు. మేధావులు సైతం కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారన్నారు. రాజధాని పేరిట అప్పులు చేసి భవిష్యత్తులో ఆ అప్పును తీర్చలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గన్నవరంలో ఇది వరకే ఎయిర్‌పోర్టు ఉన్నా.. రాజధానిలో 5 వేల ఎకరాలతో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదన్నారు.గతంలో రాజధాని కోసం భూములిచ్చిన ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. అందులో 10 వేల మంది రాష్ట్రాన్నే విడిచి వెళ్లినట్లు తెలిసిందన్నారు. శాశ్వత భవనాల పేరున చదరపు అడుగుకు ఇస్తున్న ధరలను చూసి అందరూ విస్తుపోతున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే భయమేస్తోందని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు ప్రజలను మభ్యపెడుతుండటం దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబుకు రాజధాని తప్ప మరేమీ కన్పించడం లేదా అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరల్లేక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను గాలికొదిలేసి నట్టేట ముంచారన్నారు. జనవరి నుంచి ఉపాధి హామీ బకాయిలు రూ.37 కోట్లు ఇంత వరకు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ‘నాడు–నేడు’లో పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలు ఆగిపోయాయని, హంద్రీ–నీవా కాలు వను వెడల్పు చేసి లైనింగ్ పనులు చేయమంటే కమీషన్ల కోసం లైనింగ్ పనులు మాత్రమే చేపడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు మారకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న తదితరులు పాల్గొన్నారు.
లక్ష ఎకరాలు,
రూ.లక్ష కోట్లతో అభివృద్ధా?
మాజీ ఎమ్మెల్యే విశ్వ ధ్వజం