
చుక్కలు.. తొలగని తిప్పలు
అనంతపురం అర్బన్: రైతులకు చుక్కల భూముల తిప్పలు తొలగడం లేదు. ఫైళ్ల పరిష్కార ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రతి శుక్రవారం చుక్కల భూముల ఫైళ్లను పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య నాలుగైదు మించి ఉండడం లేదు. చుక్కల భూములకు సంబంధించి 1,397కు పైగా ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా అనంతపురం రెవెన్యూ డివిజన్‌లో, అత్యల్పంగా గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలో చుక్కల భూములు ఉన్నాయి. గుంతకల్లు డివిజన్‌కు సంబంధించి ఉన్న ఏడు ఫైళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
డబ్బులిస్తేనే సక్రమంగా..
చుక్కల భూముల ఫైళ్ల పరిష్కారానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదు. ఇందుకు మండల, డివిజన్ స్థాయిలోని కొందరు సిబ్బంది అవినీతి అక్రమాలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఫైళ్లు సిద్ధం చేసే క్రమంలో కొందరు సిబ్బంది సంబంధిత రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ముడుపులు ఇవ్వని రైతు ఫైలు సక్రమంగా సిద్ధం చేయకుండా తిరస్కరణకు గురయ్యేలా చేస్తున్నారనే విమర్శలున్నాయి.
చుక్కల భూమి అంటే...
నిషేధిత భూములు (22ఏ), చుక్కల భూములు (డాటెడ్ ల్యాండ్) రెండూ ఒకేరకం కాదు. వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.1954, జూన్ 18కి ముందు అసైన్డ్ చేసిన ప్రభుత్వ భూములు 22ఏ జాబితా కిందకు వస్తాయి. ఇక చుక్కల భూముల విషయానికి వస్తే.. ప్రభుత్వ భూమిగా చెప్పబడే భూమి వివరం ఆర్‌ఎస్‌ఆర్ (రీ సెటిల్మెంట్ రిజిస్టర్)లో చుక్కలుగా చూపించి ఉండాలి. ఆ భూమి ఎవరికీ అసైన్డ్ చేసి ఉండకూడదు. ఇలాంటి భూమిని అనుభవించేవారు దరఖాస్తు చేసుకుంటే.. డీఎల్‌సీ సమావేశంలో నిర్ణయం తీసుకుని జాబితా నుంచి తొలగిస్తారు.
ఆమోద ముద్రకు నిబంధనలిలా...
చుక్కల భూముల జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న వారికి నిబంధనల ప్రకారం డీఎల్‌సీ ఆమోద ముద్ర వేస్తుంది.
● సాగు చేస్తున్నట్లుగా చెప్పబడే ప్రభుత్వ భూమి వివరం ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలుగా ఉండాలి. ఆ భూమి ఎవరి పేరునా అసైన్డ్ చేసి ఉండకూడదు.
● డాటెడ్ ల్యాండ్ చట్టం–2017 ప్రకారం... ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తి చట్టం వచ్చే నాటికి 12 ఏళ్ల ముందు ఆ భూమిపై హక్కు, అనుభవం కలిగి ఉండాలి.
● చట్టం నిబంధనల ప్రకారం సాగు చేస్తున్న వారు తహసీల్దారు వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి ఆర్‌డీఓకు తహసీల్దారు నివేదిస్తారు. దానిని ఆర్‌డీఓ విచారణ చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు.
● ఇక్కడ జిల్లాస్థాయి కమిటీ వాటిని విచారణ చేసి నిబంధనల ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నవాటిని జాబితా నుంచి తొలగిస్తూ ఆమోద ముద్ర వేస్తుంది.
మందకొడిగా ఫైళ్ల పరిష్కార ప్రక్రియ
డీఎల్‌సీలో నాలుగైదు మించి
పరిష్కారం కాని వైనం
పెండింగ్‌లో 1,390కు పైగా ఫైళ్లు
వేగవంతానికి చర్యలు
చుక్కల భూముల ఫైళ్లకు వేగవంతంగా పరిష్కారం చూపుతాం. డీఎల్‌సీ సమావేశానికి ఉంచే ఫైళ్ల సంఖ్య పెంచాలని తహసీల్దార్లు, ఆర్‌డీఓలను ఆదేశించాం. మండలాలవారీగా షెడ్యూల్ ఇచ్చి ప్రతి శుక్రవారం డీఎల్‌సీ సమావేశం నిర్వహిస్తూ ఫైళ్లు పరిష్కరిస్తున్నాం. ఫైళ్లు ఎలా సిద్ధం చేయాలనే దానిపై మండల, డివిజన్ స్థాయి రెవెన్యూ సిబ్బందికి వారం క్రితం శిక్షణ ఇచ్చాం.
– వి.వినోద్‌కుమార్, కలెక్టర్

చుక్కలు.. తొలగని తిప్పలు