అనంతపురం: మేధస్సును కదిలించేది ‘శ్రమ కావ్య గానం’ అని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక తేజ అన్నారు. ఆయన రచించిన శ్రమ కావ్యం గానం పుస్తక పరిచయ కార్యక్రమం అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో సీఐటీయూ, ఐద్వా, యూటీఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నాయకురాలు డాక్టర్ ప్రగతి మాట్లాడుతూ... సుద్దాల అశోక్ తేజ సాహితీ ప్రస్థానాన్ని వివరించారు. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ రచనలు శ్రమ శక్తిని చాటేలా ఉంటాయన్నారు. అనంతరం సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. శ్రమ కావ్యం గానం గురించి వివరించారు. శ్రమ అన్నది మేథో శ్రమ, శారీరక శ్రమ రెండు రకాలుగా ఉంటుందన్నారు. ఈ రెండు కలగలిసి ప్రయాణం సాగిస్తుంటాయని వివరించారు. శ్రమ ద్వారానే సామాజిక గమనం ఉంటుందనే అంశాన్ని శ్రమ కావ్యం గానం ద్వారా వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, సీఐటీయూ ఆర్వీ నాయుడు, యూటీఎఫ్ లింగన్న, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం బాష, సామాజిక వేత్త బోస్, మానవతా రక్తదాత తరిమెల అమర్‌నాథ్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకుడు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సుద్దాల అశోక తేజ