
గోవుల సంరక్షణకు సహకరిస్తాం
● గోశాల నిర్వాహకులకు
కలెక్టర్ వినోద్‌కుమార్ సూచన
అనంతపురం అర్బన్: గోవుల సంరక్షణకు అవసరమైతే జిల్లా యంత్రాంగం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఇస్కాన్ గోశాల ఇన్‌చార్జి దామోదర్ గౌరంగదాస్‌కు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్ సమీపంలోని ఇస్కాన్ గోశాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు. గోవులకు పచ్చగడ్డి, అరటిపండ్లు, బెల్లం తినిపించారు. ఎంత విస్తీర్ణంలో గోశాల ఏర్పాటు చేశారు? ఎన్ని గోవులున్నాయి? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 2.70 ఎకరాల విస్తీర్ణంలో గోశాల ఏర్పాటు చేయగా... ప్రస్తుతం 440 ఆవులు ఉన్నాయని, గడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదని గోశాల ఇన్‌చార్జి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నగర రహదారులపై సంచరిస్తున్న పశువులకూ ఆశ్రయం కల్పించాలని సూచించారు. దీంతో గోశాలకు అదనపు భూమి కేటాయిస్తే వాటిని అక్కడ ఉంచి సంరక్షిస్తామని కలెక్టర్‌కు ఇన్‌చార్జి తెలిపారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ భూ కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం గోశాలలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ కేశవనాయుడు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటస్వామి, ఏడీ రత్నకుమార్, తహసీల్దార్లు పుణ్యవతి, మోహన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
క్షతగాత్రుడి ప్రాణాలు
కాపాడిన డీఎస్పీ
రాప్తాడు: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అసహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు సకాలంలో తన వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. రాప్తాడుకు చెందిన యువకుడు చెడిపోతుల కుళ్లాయప్ప ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళుతూ జేఎన్‌టీయూ మార్గంలోని భారత్ గ్యాస్ కార్యాలయం ఎదుట డివైడర్‌ను ఢీకొని తీవ్ర గాయాలతో పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి 108కు సమాచారం అందించారు. అయితే ఎంతకూ 108 వాహనం రాలేదు. ఈ లోపు కుళ్లాయప్ప పరిస్థితి విషమిస్తుండడంతో తన సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశులు అప్రమత్తయ్యారు. అప్పటికే ఇంటికి వాహనంలో బయలుదేరిన ఆయన వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న కుళ్లాయప్పను స్థానికుల సాయంతో తానే పైకి లేపి తన వాహనంలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో స్థానికంగానే తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అటు నుంచి బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కాగా, క్షతగాత్రుడిని తన వాహనంలో ఆస్పత్రికి చేర్చిన డీఎస్పీ చొరవను స్థానికులు అభినందిచారు. ‘ఈ సార్ చాలా మంచోడు’ అంటూ కితాబునిచ్చారు.
వైభవం.. సల్లాపురమ్మ జ్యోతుల ఉత్సవం
పుట్టపర్తి అర్బన్: పెడపల్లిలో ఆదివారం సల్లాపురమ్మ జ్యోతుల ఉత్సవం వైభవంగా సాగింది. వేలాది కుటుంబాలు ఉన్న గ్రామంలో ప్రతి ఇంటి నుంచి జ్యోతులు, బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి వాటిని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనాలను అమ్మవారికి సమర్పించిన అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. భక్తులు పెద్ద ఎత్తున బియ్యం, బేడలు, ఆకు వక్క తదితరాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద పోతురాజు విన్యాసాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన తినుబండారాలు, ఆట బొమ్మల అంగళ్ల వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొంది.

గోవుల సంరక్షణకు సహకరిస్తాం

గోవుల సంరక్షణకు సహకరిస్తాం