
●21 మండలాల్లో అకాల వర్షం
పెద్దవడుగూరు మండలం అప్పేచర్లలో విరిగిపడిన బొప్పాయి చెట్లను చూపుతున్న బాధిత రైతు
అనంతపురం అగ్రికల్చర్: ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు 21 మండలాల పరిధిలో 12.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో 72.2 మి.మీ, గుంతకల్లు 68.2 మి.మీ భారీ వర్షం కురిసింది. వజ్రకరూరు 46.2 మి.మీ, శెట్టూరు 34.4,కుందుర్పి 29.6, కళ్యాణదుర్గం 29.4, కంబదూరు 18.6, బ్రహ్మసముద్రం 17, బెళుగుప్ప 15.2, గుత్తి 14.4, రాయదుర్గం, గుమ్మఘట్ట 10.2 మి.మీ వర్షం కురిసింది. రాప్తాడు, విడపనకల్లు, కణేకల్లు, పామిడి, ఉరవకొండ, డీ.హీరేహాళ్, పెద్దవడుగూరు, యాడికి, బొమ్మనహాళ్ మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీయడంతో రూ.2 కోట్ల మేర పంటనష్టం వాటిల్లినట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు అరటి, చీనీ, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి.