నాలుగో స్థానంలో ‘శ్రీసత్యసాయి’
అనంతపురం సెంట్రల్: డ్రిప్, స్పింక్లర్ల మంజూరులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం, జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందని ఏపీఎంఐపీ రాష్ట్ర ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నగరంలో ప్రాంతీయ ఉద్యాన శిక్షణా సంస్థ కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్లు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసత్య సాయి జిల్లా రాష్ట్రంలో నాలుగు, జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో ఉందని అభినందించారు. రైతుల పొలాల్లో పరికరాలను త్వరితగతిన అమర్చి సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు సహకరించాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వంద శాతం రైతులు డ్రిప్ వాడేలా చూడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అనంతపురం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రఘునాథరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఏపీఎంఐపీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు మంగళవారంతో ముగుస్తుందని ఇంటర్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.వెంకటరమణ నాయక్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్‌మెంట్ రాసే విద్యార్థులు వెంటనే పరీక్ష ఫీజు సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. ఫీజు బకాయి ఉందనే సాకుతో ప్రైవేట్ జూనియర్ కళాశాలల యజమాన్యాలు విద్యార్థుల నుంచి కట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరూ తప్పనిసరిగా పరీక్ష ఫీజు చెల్లించేలా చూడాల్సిన బాధ్యత ఆయా కళాశాలల యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు.
నేడు అనంత కోర్టుకు బోరుగడ్డ అనిల్
అనంతపురం: నగరంలోని మొబైల్ కోర్టుకు మంగళవారం బోరుగడ్డ అనిల్ హాజరుకానున్నారు. స్థానిక రామచంద్రానగర్ చర్చికి సంబంధించి ఆదాయం లెక్కింపు అంశంలో పోలీసులను దూషించాడనే అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు ఎస్కార్టుతో అనంతపురం కోర్టుకు తీసుకురానున్నారు.
తగ్గుతున్న చింత పండు ధరలు
హిందూపురం అర్బన్: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌లో గత మూడు వారాలుగా చింత పండు ధరలు పడిపోతున్నాయి. సోమవారం 881.70 క్వింటాళ్ల చింత పండు వచ్చింది. మార్కెట్‌లో ఈ నామ్ పద్ధతిలో వేలం పాటలు సాగాయి. కరిపులి రకం క్వింటా గరిష్ట ధర రూ.19,500, కనిష్టం రూ.8 వేలు, సగటు రూ.15 వేలు పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్ట ధర రూ.12,500, కనిష్టం రూ.4,420, సగటు ధర రూ.8 వేలు పలికింది. గత వారంతో పోలిస్తే కరిపులి కరం క్వింటాపై రూ.1,000 తగ్గుదల కనిపించింది. వాతావరణ మార్పులు, చల్లదనంతో ధరలు తగ్గుముఖం పట్టినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.