
తెలంగాణ సీఎం పీఎస్‌గా శ్రీనివాసరాజు
● ఏపీఆర్‌ఎస్ పూర్వ విద్యార్థికి దక్కిన గౌరవం
పరిగి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రిన్సిపల్ సెక్రెటరీగా కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్ పూర్వ విద్యార్థి కేఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలోని ఈసలాపురం గ్రామానికి చెందిన కేఎస్ శ్రీనివాసరాజు 1976లో ఏపీఆర్‌ఎస్ కొడిగెనహళ్లిలో 8వ తరగతిలో ప్రవేశం పొందారు. 1978–79 విద్యాసంవత్సంలో పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన ఆయన... గ్రూప్–1 ఆఫీసర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అంచలంచెలుగా ఎదుగుతూ ఐఏఎస్ దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేశారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో 2011 నుంచి దాదాపు 99 నెలల పాటు జేఈఓగా పనిచేసి రాష్ట్రంలోనే ఖ్యాతి గడించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు కేటాయించడంతో తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణపొందారు. ఆ తర్వాత 2024 జూలై నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పనిచేశారు. తాజాగా తెలంగాణ సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమితులయ్యారు.