
అధికార అండతో గత టీడీపీ ప్రభుత్వంలో సహజ వనరులను మామ కొల్
నేమకల్లు సమీపంలో ఏర్పాటైన క్రషర్ యూనిట్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒకవైపు మామ.. మరోవైపు అల్లుడు కూడబలుక్కుని రాయదుర్గం నియోజకవర్గంలో సహజ వనరులకు నిలయమైన నేమకల్లును లూటీ చేశారు. అత్యంత నాణ్యమైన కంకర ఇక్కడ లభిస్తుంది. దీనికోసం కొండలను మొత్తం పిండిచేశారు. మామ టీవీఎస్ కాంతారావు, అల్లుడు రఘు ప్రతాప్‌లు నేమకల్లులో ఉన్న సహజ వనరులను పూర్తిగా ఊడ్చేశారు. పదుల సంఖ్యలో కంకర మిషన్లు, జేసీబీలు, రవాణా వాహనాలతో రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లు రణగొణ ధ్వనులతో మారుమోగిపోతోంది. యంత్రాల శబ్దాలు, కాలుష్యంతో చుట్టుపక్కల పల్లెలు అల్లాడిపోతున్నాయి.
అనుమతి గోరంత..తవ్వింది కొండంత
మామ కాంతారావు..అల్లుడు రఘుప్రతాప్ ఇద్దరూ మైనింగ్ మాఫియా డాన్‌లే. రఘుప్రతాప్‌కు సర్వే నంబర్ 253లో 4.6 హెక్టార్లలో మాత్రమే గతంలో మైనింగ్‌కు అనుమతి ఉండగా రమారమి 30 ఎకరాల్లో తవ్వినట్టు స్థానికులు చెబుతున్నారు. 2019లో అక్రమ మైనింగ్ జరిపారని అప్పటి మైనింగ్ అధికారులు విచారణ చేసి రూ.7.07 కోట్ల జరిమానా విధించారు. కానీ ఇప్పటివరకూ రఘుప్రతాప్ ఒక్కపైసా కట్టలేదు. పైగా ఇప్పుడు జరిమానా మాఫీ చేయించుకునేందుకు నేరుగా సీఎంఓ నుంచి పునః పరిశీలన అనుమతులు తెచ్చుకున్నారు. అప్పుడు జరిమానా విధించిన అధికారులతోనే ఇప్పుడు ఎలాంటి అక్రమాలు లేవని నివేదిక ఇప్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మామ కాంతారావు కట్టాల్సిన రూ.13 కోట్లు, అల్లుడు రఘుప్రతాప్ కట్టాల్సిన రూ.7 కోట్లలో ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
అనుమతులు లేకుండానే మైనింగ్
ఓవైపు జరిమానాలు విధించారు. అవి ఇప్పటివరకూ కట్టనే లేదు. పోనీ కనీసం కొత్తగా అనుమతులైనా ఉన్నాయా అంటే అదీ లేదు. కూటమి సర్కారు వచ్చిన మరుసటి రోజు నుంచే మామా అల్లుళ్లు నేమకల్లు పరిసరాల్లో వాలిపోయారు. ఇక్కడ లభించే కంకరను కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే 40 ఎకరాల గుట్ట కరిగిపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. భారీ వాహనాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. నేమకల్లులో ఇలాగే మైనింగ్ కొనసాగితే భవిష్యత్తులో కొత్తగా ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు టిప్పర్ కంకర కూడా మిగిలేలా లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.
పెచ్చుమీరిన ఆగడాలు..
రాయదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ గత కొన్ని నెలలుగా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. మరోవైపు అక్రమ మైనింగ్‌తో కొండలను పిండి చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నా ‘కాలవ’ కిమ్మనడం లేదు. మైనింగ్ మాఫియాకు పూర్తి స్థాయిలో రాజకీయ అండదండలున్నట్టు విమర్శలున్నాయి.
మైనింగ్ డీడీ ఉన్నా లేనట్టే...
ఇటీవల జిల్లా గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వెంకటేశ్వర్లు వచ్చారు. ఈయన ఆధ్వర్యంలో ఎక్కడా తనిఖీలు లేవు. ఎవరికి నచ్చినట్టు వారు దోపిడీ చేసుకోవచ్చు. దోపిడీ జరుగుతోందంటూ ఎవరైనా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. ‘నాకు ఇక్కడ పనిచేయాలని లేదు, ఎప్పుడు బదిలీ వచ్చినా వెళ్లిపోతా’ అని చెబుతున్నారు. నేమకల్లు పరిసరాల్లో దోపిడీపై వివరణ కోరేందుకు డీడీకి ఫోన్ చేసినా స్పందించలేదు.
నేమకల్లు సహజవనరులను ఊడ్చేసిన రఘుప్రతాప్
మామ కాంతారావుతో కలిసి దోపిడీ
ప్రతాప్ చెల్లించాల్సిన రూ.7 కోట్ల జరిమానాకు ఎగనామం
అనుమతి లేకుండానే క్రషర్లతో కొండలను పిండిచేస్తున్న వైనం
మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూస్తే ఒట్టు
అండగా నిలిచిన ‘దుర్గం’ ప్రజాప్రతినిధి

అధికార అండతో గత టీడీపీ ప్రభుత్వంలో సహజ వనరులను మామ కొల్