ఆక్రమణకు గురైన భూముల్లో ఆందోళనకు దిగిన దళితులు (ఇన్‌సెట్) రాత్రికి రాత్రే వేసిన బోరు
ప్రభుత్వం 17 ఏళ్ల క్రితం సుమారు 83 దళిత కుటుంబాలకు పట్టాలిచ్చిన డీకేటీ భూములపై స్థానిక పెద్దల కన్ను పడింది. మూడు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సుమారు 20 ఎకరాలను ఆక్రమించేశారు. అదును చూసి జేసీబీలతో చదును చేశారు. రాత్రికి రాత్రే బోరు డ్రిల్ చేశారు. విషయం తెలుసుకున్న బాధిత దళితులు పట్టాదారు పాసుపుస్తకాలతో శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన కేవీబీపురం మండలం పెరిందేశంలో కలకలం రేపింది.
కేవీబీపురం: మండలంలోని పెరిందేశం గ్రామానికి చెందిన సర్వే నం.254 (బ్లాకు)లో అదే గ్రామానికి చెందిన 83 దళిత కుటుంబాలకు 2003లో అప్పటి ప్రభుత్వం కుటుంబానికి ఎకరా చొప్పున పట్టాలిచ్చింది. అధికారులు సర్వేచేసి భూములను లబ్ధిదారులకు చూపించలేదు. అదే భూమిపై స్థానిక పెద్దల కన్ను పడింది. శ్రీకాళహస్త్రికి చెందిన ఓ వ్యాపారికి సదరు భూమి తమ స్వాధీనంలో ఉన్నట్టు నమ్మబలికారు. అందులో 20ఎకరాలు విక్రయించేందుకు సిద్ధపడ్డారు. సదరు వ్యాపారి, స్థానిక పెద్దలు కొందరు మూడు రోజులుగా రాత్రి పూట జేసీబీలతో చదును చేయడం ప్రారంభించారు. ఎవరికీ తెలియకుండా బోరు కూడా డ్రిల్ చేయడంతో బాధిత దళితులు ఉలిక్కిపడ్డారు. సంబంధిత భూమిలో పట్టాలు చేతబట్టి ఆందోళనకు దిగారు.
ఆ భూమి దళితులదే
ఆక్రమణను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. సదరు భూమి దళితులదేనని తేల్చారు. త్వరలో అధికారిక సర్వేలు జరిపి ఎవరి భూములను వారికి చూపిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దళిత, ప్రభుత్వ భూములపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇదిలావుండగా అదే గ్రామానికి చెందిన తాజా మాజీ టీడీపీ సర్పంచ్ భర్త గతంలో ఆ భూములకు పాసు పుస్తకాలు చేయిస్తానని నమ్మబలికినట్టు తెలుస్తోంది. ప్రతి పట్టాదారు నుంచి రూ.500 వసూలు చేసి మొండిచేయి చూపించినట్టు బాధితులు తహసీల్దార్‌కు ఫిర్యాదుచేశారు. ఇదే భూమిలో ఆయనకున్న ఎకరా భూమిని అడ్డుపెట్టుకుని సుమారు 8 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
న్యాయం చేస్తాం
పెరిందేశం గ్రామ పరిధిలోని బ్లాకు నం.254లో ప్రభు త్వం ఇచ్చిన పట్టాల ప్రకారం అర్హులకు కచ్చితంగా న్యాయం చేస్తాం. దళితులు, ప్రభుత్వ భూములు ఎవరి చెరలో ఉన్నా స్వాధీనం చేసుకుంటాం. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
–జీ.మోహన్, తహసీల్దార్ కేవీబీపురం
Comments
Please login to add a commentAdd a comment