మృత్యు కెరటాలు! నాలుగేళ్లలో 233 మంది పర్యాటకులు బలి.. | 233 Tourists Died In Four Years On Vizag Beach Know Why | Sakshi
Sakshi News home page

Vizag Beach: ఎక్కువ ప్రమాదాలు ఆ నెలల్లోనే!

Published Tue, Jan 4 2022 8:55 AM | Last Updated on Tue, Jan 4 2022 9:22 AM

233 Tourists Died In Four Years On Vizag Beach Know Why - Sakshi

తీరంలో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని తీసుకొచ్చి ఈతగాళ్లకు అప్పగిస్తున్న నేవీ హెలికాప్టర్‌

Unimaginable death rate in Vizag beach These are reasons బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే సుందర సాగర తీరం... ఒక్కోసారి వారిపైనే ఉగ్రరూపం చూపిస్తోంది. అనూహ్యంగా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడి కాటేస్తున్నాయి. మరోవైపు అత్యుత్సాహంతో కొందరు కెరటాలకు బలైపోతున్నారు. పోలీసులు, మెరైన్‌ పోలీసులు, లైఫ్‌గార్డ్స్‌ నిరంతరం పహారా కాస్తున్నప్పటికీ తీరంలో విషాద ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, ఒడిశా నుంచి నగరానికి వచ్చి తీరంలో సేద తీరుతున్న నలుగురిని రాకాసి కెరటాలు ఆదివారం కాటేసిన విషయం తెలిసిందే. 2018లో 55 మంది, 2019లో 51 మంది, 2020లో 64 మంది, 2021లో 63 మంది మృతిచెందారు. మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో 233 మంది కెరటాలకు బలైపోయారు. 
 
రిప్‌ కరెంట్‌తో భారీ కెరటాలు  
విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తేన్నేటి పార్క్, సాగరనగర్, రుషికొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్‌ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగరం అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంత మంది సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో... అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు. విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్‌ కరెంట్‌ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్‌ కరెంట్‌ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్న వారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్‌గార్డ్స్‌ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్‌ కరెంట్‌ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడడం అసాధ్యం.  


                          యువకుడి మృతదేహాన్ని బయటకు తీసుకొస్తున్న సిబ్బంది

చదవండిఆర్‌కే బీచ్‌లో ఇద్దరి మృతి

లైఫ్‌గార్డ్స్‌తో కొంత రక్షణ  
పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న బీచ్‌లలో ఎవరైనా ప్రమాదాలకు గురైతే రక్షించేందుకు 38 మంది లైఫ్‌ గార్డ్స్‌ను జీవీఎంసీ నియమించింది. తీరంలో ఎవరైనా అలలకు చిక్కినప్పుడు వీరు సకాలంలో స్పందించడం వల్లే సుమారు 95 శాతం మంది సురక్షితంగా బయటపడుతున్నారు. ఆర్కే బీచ్‌లో 20 మంది, యారాడ, రుషికొండలో ఆరుగురేసి, తెన్నేటిపార్కు బీచ్, సాగర్‌నగర్, ఐటీ హిల్స్‌ బీచ్‌లలో ఇద్దరేసి చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. అయితే తీరంలో ప్రమాదానికి గురై సముద్రంలో కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వారిని రక్షించగలుగుతున్నప్పటికీ... రిప్‌ కరెంట్‌ వల్ల వచ్చే కెరటాలకు చిక్కే వారిని సరైన పరికరాలు లేకపోవడంతో రక్షించడం కష్టతరంగా మారుతోందని లైఫ్‌గార్డ్స్‌ అంటున్నారు. విదేశాల్లో లైఫ్‌గార్డ్స్‌కు తోడుగా స్పీడ్‌ బోట్లు అందుబాటులో ఉంటాయని... వాటి సాయంతో బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒడిశా యువతిని, హైదరాబాద్‌ అబ్బాయిని లైఫ్‌గార్డ్స్‌ పట్టుకున్నప్పటికీ... అప్పటికే కెరటంలో ఎక్కువ సేపు ఇరుక్కుపోవడం వల్ల మరణించారు. అదే స్పీడ్‌ బోట్లు అందుబాటులో ఉంటే వేగంగా వెళ్లి బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.  

పండగల వేళ విషాదాలు
సాధారణంగా బీచ్‌లో ఎక్కువగా అక్టోబర్‌ నుంచి జనవరి నెల మధ్యలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. దసరా, దీపావళి, కార్తీకమాసం, నూతన సంవత్సర వేడుకలకు ఎక్కువగా పర్యాటకులు రావడంతో తీరంలో రద్దీ ఉంటుంది. ఆ సమయాల్లో దేశ, విదేశాల నుంచి సందర్శకులు కూడా నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్‌కే బీచ్‌లో రోజూ సుమారు 20 మంది పోలీసులు, మరో 20 మంది లైఫ్‌గార్డ్స్‌ అందుబాటులో ఉంటూ పర్యాటకులను హెచ్చరిస్తుంటారు. మరోవైపు మెరైన్‌ పోలీసులు తీరం వెంబడి గాస్తీ కాస్తుంటారు. అయినప్పటికీ సందర్శకుల అత్యుత్సాహం, కొందరు యువకులు మద్యం మత్తులో స్నానాలకు దిగడంతో ప్రమాదాలకు గురవుతున్నారని పోలీసులు భావిస్తున్నారు.  


నిరంతరం హెచ్చరిస్తుంటాం
సముద్రంలోకి స్నానాలకు దిగవద్దని సందర్శకులను లైఫ్‌ గార్డ్స్, పోలీసులు నిరంతరం తీరంలో హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. చాలా ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు కాపాడిగలిగాం. పర్యాటకులు సముద్రం లోపలకు వెళ్తుంటే లైఫ్‌గార్డులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తున్నాం. అయినప్పటికీ ప్రమాదాలు జరగడం బాధాకరం. 
– జి.మురళీ కృష్ణ, మెరైన్‌ ఎస్‌ఐ

క్షణాల్లో స్పందిస్తున్నాం 
కెరటాలకు సందర్శకులు చిక్కుకున్నారని తెలిసిన క్షణాల్లోనే స్పందిస్తున్నాం. బాధితులను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. అయితే రిప్‌ కరెంట్‌ అలల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కష్టమవుతోంది. సరైన పరికరాలు సమకూరిస్తే బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని అనేకసార్లు ఉన్నాతాధికారులకు చెప్పాం. మాకు 9 నెలలుగా జీతాలు చెల్లించకపోయినా పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం.           
– దేవుడు, లైఫ్‌గార్డు

చదవండి: కరకట్టపై పల్టీకొట్టిన ఆటో..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement