రాజమహేంద్రవరం క్రైం: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీలు కరోనా బారిపడ్డారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 247 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల ఒకటో తేదీన 75 మందికి పరీక్షలు చేయగా జైల్‌లో విధులు నిర్వహిస్తున్న 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు, 2వ తేదీన 64 మందికి పరీక్షలు చేయగా 9 మంది ఖైదీలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సెంట్రల్ జైలులో మొత్తం 1,675 మంది ఖైదీలు ఉండగా వారిలో 265 మంది ఖైదీలు కరోనా వైరస్ సోకింది. పాజిటివ్ వచ్చిన జైల్ సిబ్బంది 24 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఒకటి, రెండో తేదీల్లో చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన 18 మంది ఖైదీలకు జీఎస్‌ఎల్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. అయితే వీరిలో ఒక ఖైదీ ఆస్పత్రి నుంచి పరారీ కావడంతో మొత్తం ఖైదీలను ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జ్ చేయడంతో (8 మంది బెయిల్‌పై విడుదలయ్యారు), మిగిలిన 10 మంది ఖైదీలను రాజ మహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఉంచి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. ఈ నెల 3వ తేదీన చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 247 మంది ఖైదీలను బయటి ఆస్పత్రికి తరలిస్తే సెక్యూరిటీ సమస్యతో పాటు భారీ స్థాయిలో బెడ్లు ఏర్పాటు చేయవలసి ఉంటుందని దీంతో ఖైదీలను సెంట్రల్ జైల్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్ ఎస్.రాజారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment