తీవ్ర జ్వరంతో చిన్నారి మృత్యువాత
బిడ్డ మృతదేహం వద్ద విలపించిన తల్లి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మూడేళ్ల చిన్నారి తన్వితకు మూడురోజులుగా తీవ్ర జ్వరం. కళ్లు తెరవలేని పరిస్థితి. వైద్యం చేయిద్దామన్నా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి తల్లిదండ్రులది. జ్వరంతోనే ఈ చిన్నారి మృత్యువాతపడింది. న్యూ రాజరాజేశ్వరి పేటలోని జీప్లస్ త్రీ అపార్ట్‌మెంట్ 20వ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తున్న రొట్టా కృష్ణ, సునీత దంపతులకు ఇద్దరు పిల్లలు. తని్వత(3) పెద్దపాప. కృష్ణ పెయింటింగ్ పనులు చేస్తూ, సునీత ఇంటి వద్ద కుట్టుమిషన్ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు.
బుడమేరు వరద కృష్ణ ఇంటిలోకి చేరడంతో సమీపంలో బంధువుల ఇంటిలో తలదాచుకున్నారు. వారం రోజులుగా రాజరాజేశ్వరిపేటను వరద ముంచేసింది. బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించే వీలులేదు. ఈ క్రమంలో తని్వతకు మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లలేని నిస్సహాయస్థితి. ఇంట్లోనే అందుబాటులో ఉన్న మాత్రలు వేశారు. సోమ వారం కొంత వరద తగ్గడంతో తన్వితను పాత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ పరీక్షించిన వైద్యులు మార్గ మధ్యంలోనే పాప చనిపోయిందని నిర్ధారించారు. మాయ దారి వరద తమ బిడ్డను మింగేసిందంటూ తన్విత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘తన్వీ.. లేనాన్న.. నన్ను చూడు.. నీకేం కాదు. నేనున్నాను..’ అంటూ చిన్నారి మృతదేహంపైపడి తల్లి సునీత రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment