సాక్షి, అమరావతి: ‘అందరికీ ఇళ్ల పథకం’ కింద ఈ నెల 25న లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) సన్నద్ధమవుతోంది. ఈ పథకం కింద 300 ఎస్‌ఎఫ్‌టీ ఉన్న టిడ్కో ఇళ్లను ఒక్క రూపాయికే అందివ్వనుంది. టీడీపీ ప్రభుత్వంలో పునాదుల దశ కూడా దాటని టిడ్కో యూనిట్ల స్థానంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయనుంది.
రూ.9,995 కోట్ల టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్
► వీటికి సంబంధించిన పూర్తి ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రకారం 300 ఎస్‌ఎఫ్‌టీ టిడ్కో యూనిట్లను లబ్ధిదారులకు ఈ నెల 25న సేల్ అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు.
► దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 88 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,43,600 మంది లబ్ధిపొందనున్నారు.
► జి+3 నమూనాలో నిర్మించిన ఆ టిడ్కో ఇళ్ల మొత్తం విలువ రూ.9,995 కోట్లు. భూమి, మౌలిక సదుపాయాలతో కలిపి ఒక్కో యూనిట్ విలువ రూ.6.65లక్షలు.
వారికి పట్టాలు.. ఉచితంగా ఇళ్లు
► గతంలో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పనులను ఆర్భాటంగా ప్రారంభించి తరువాత వదిలేసింది. దాంతో పునాదుల దశలోనే 51 వేల యూనిట్లు నిలిచిపోయాయి.
► ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దుచేసింది.
► వాటి స్థానంలో ఆ లబ్ధిదారులకు ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నిర్ణయించింది.
► ఈ నెల 25 నుంచి వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తారు.
► ఆ స్థలాల్లో ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుంది.
► 365 ఎస్‌ఎఫ్‌టీ, 430 ఎస్‌ఎఫ్‌టీ యూనిట్లకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ప్రకటించింది.
► గత టీడీపీ ప్రభుత్వంలో 365 ఎస్‌ఎఫ్‌టీ యూనిట్‌కు రూ.50వేలు లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సి ఉండేది. అందులో రూ.25వేలు తమ ప్రభుత్వం భర్తిస్తుందని ఇటీవల సీఎం జగన్ ప్రకటించారు. రూ.7.55 లక్షల విలువ చేసే 365 ఎస్‌ఎఫ్‌టీ యూనిట్‌కు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను సమకూరుస్తుంది. దీనివల్ల 44,304 మంది లబ్ధి పొందనున్నారు.
► అదే విధంగా.. 430 ఎస్‌ఎఫ్‌టీ యూనిట్‌కు టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుని వాటా రూ.లక్ష ఉండేది. అందులో రూ.50వేలు తమ ప్రభుత్వం భరిస్తుందని జగన్ ప్రకటించారు. రూ.8.55 లక్షలు విలువ చేసే 430 యూనిట్‌కు మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం సమకూరుస్తారు. దీనివల్ల 74,312మందికి ప్రయోజనం కలగనుంది.
► పై రెండు కేటగిరీల లబ్ధిదారులకు కూడా ఈనెల 25 నుంచి సేల్ రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.
పక్కాగా ఏర్పాట్లు
300 ఎస్‌ఎఫ్‌టీ లోపు టిడ్కో యూనిట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పునాదుల దశ దాటకపోవడంతో రద్దుచేసిన 51వేల టిడ్కో ఇళ్ల స్థానంలో ఆ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాం. అనంతరం ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుంది.
– శ్రీధర్, ఎండీ, ఏపీ టిడ్కో
Comments
Please login to add a commentAdd a comment