డ్రైవర్‌ను ఆరా తీస్తున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి
కాకినాడ క్రైం: కరోనా రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శవంతమైన సేవలను అందిస్తుంటే ఆ సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందకుండా అవినీతిపరులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో కనీస విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా ర్యాపిడ్ కిట్ల వ్యవహారంలో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం కలకలం రేపింది. ఇప్పటికే ఓ సారి కరోనా కిట్లు చోరీకి గురికావడం జిల్లాను కుదిపేసింది. దానికి కొనసాగింపుగా ఆదివారం మరో మారు కరోనా ర్యాపిడ్ కిట్లు చోరీకి గురయ్యాయి. కిట్ల చోరీపై డీఎంహెచ్‌ఓ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగింది?
ఆరోగ్యశ్రీ సమన్వయకర్త పర్యవేక్షణలో డీపీఎంయూ ఆదేశాలతో రెగ్యులర్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ డ్రైవర్ వ్యాక్సిన్ వ్యాన్‌తో శనివారం కాకినాడ నుంచి విజయవాడ వెళ్లారు. అక్కడ ఆరోగ్యశ్రీ సీఈవో కార్యాలయం నుంచి కరోనా నిర్థారణకు వినియోగించే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను తీసుకొని రాత్రి 10.30 సమయంలో బయల్దేరాడు. ఆదివారం తెల్లవారు జామున కాకినాడ చేరుకున్నాడు. నైట్ డ్యూటీ విధుల్లో ఉన్న హెల్త్ సూపర్‌వైజర్, హెల్త్ అసిస్టెంట్, డ్రైవర్ కలిసి ఆ కిట్లను అదనపు డీఎంహెచ్‌ఓ గదికి తరలించి భద్రపరిచారు. ఉదయం కార్యాలయ సిబ్బంది ఆరోగ్యశ్రీ మేనేజర్ సమక్షంలో విజయవాడ నుంచి వచ్చిన 13 కార్టూన్లను తెరిచారు. అప్పుడు అసలు విషయం వెల్లడైంది. అలా తెరిచిన పెట్లలో 50 కిట్లు మాయమైనట్టు గుర్తించారు. వెంటనే సిబ్బంది డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరికి తెలిపారు.
ఎస్కార్ట్ లేకుండానే....
కిట్లను తీసుకొచ్చేందుకు ఆరోగ్యశ్రీ అధికారులు కేవలం డ్రైవర్‌ని పంపారు. నిబంధనలు అనుసరించి ఎస్కార్ట్‌గా ఓ ల్యాబ్ టెక్నీషియన్ లేదా ఫార్మసిస్టుని పంపాల్సి ఉన్నా ఆ నిబంధనలు ఏవీ పాటించలేదు. వ్యాక్సిన్ వ్యాన్‌తో తానొక్కడినే వెళ్లానని తనతో ఎవరినీ అధికారులు పంపలేదని డ్రైవర్ చెప్పాడు. ఆ విషయాన్ని సంబంధిత అధికారులూ నిర్థారించారు. కిట్ల మాయం వ్యవహారంపై డ్రైవర్‌ను డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుబ్రహ్మణేశ్వరి ప్రశ్నించగా అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. కార్టూన్లలో కిట్ల మాయం గురించి తనకేమీ తెలియదన్నాడు. తాను తెచ్చిన 13 కార్టూన్లు తెరిచే ఉన్నాయని, వాటిని మూసి వేస్తూ ఎటువంటి సీలు విజయవాడ సిబ్బంది వేయలేదని చెప్పాడు. ఆ విషయంపై స్పష్టత కోసం డీఎంహెచ్‌ఓ విజయవాడ కార్యాలయ అధికారులను ఫోనులో వివరణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment