వెంట వెంటనే.. ఇంటి చెంతనే.. | 539 types of services in 845 secretariats in Srikakulam district | Sakshi
Sakshi News home page

వెంట వెంటనే.. ఇంటి చెంతనే..

Published Sun, Feb 7 2021 5:42 AM | Last Updated on Sun, Feb 7 2021 5:42 AM

539 types of services in 845 secretariats in Srikakulam district - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గత ప్రభుత్వంలో కాళ్లరిగేలా తిరిగినా సమస్యలు పరిష్కారం అయ్యేవి కావు..  సంక్షేమ పథకాలు అందాలంటే టీడీపీ కార్యకర్తలై ఉండి జన్మభూమి కమిటీ సభ్యులకు ముడుపులు ముట్టజెప్పాల్సి ఉండేది. అవి కూడా ఏ రెండు మూడేళ్లకో వచ్చేవి. రేషన్‌కార్డు కావాలన్నా.. పింఛను రావాలన్నా ఇంతే. ఇప్పుడా పరిస్థితి మారింది. పార్టీలకు అతీతంగా ఫలాలు అందుతున్నాయి. అర్హులైతే చాలు పథకాలన్నీ ప్రజల ఇంటి చెంతకే వచ్చి చేరుతున్నాయి. సంతృప్తికర స్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనంతో 539 రకాల సేవలందిస్తున్న గ్రామ సచివాలయాలు అన్ని వర్గాల మన్ననలు పొందుతున్నాయి. సంక్షేమ పథకాలే కాదు.. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పెద్దఎత్తున జరుగుతున్నాయి. అలాగే..

► సచివాలయాల ద్వారా తక్కువ వ్యవధిలో రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు పొందుతున్నారు. 
► ఇళ్ల స్థలాలకైతే మూడు నెలల్లోపే ఎంపికైన వారున్నారు. ఠి సచివాలయాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 845 గ్రామ సచివాలయాల్లో ఇప్పటివరకు 10,67,635 దరఖాస్తులు రాగా, వాటిలో 10,37,199 పరిష్కారమయ్యాయి. 

పంచాయతీల్లో అభివృద్ధి పనులు..
► 2019–20లో రూ.153.72 కోట్లతో, 2020–21లో రూ.58.56 కోట్లతో మౌలిక సౌకర్యాలు కల్పించారు. 
► జిల్లాలో రూ.301.52 కోట్లతో 3 లక్షల 73 వేల 537 ఇళ్లకు ఇంటింటి కుళాయి కనెక్షన్ల ద్వారా తాగు నీరిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
► నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల రూపురేఖలు మారిపోయాయి.  1,249 పాఠశాలల్లో రూ.239.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
► జిల్లాలో 1,128 లేఅవుట్లు వేసి లక్షా 23 వేల 62 మందికి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఇచ్చింది. 
► ఐటీడీఎ పరిధిలో రూ.60 కోట్లతో తారురోడ్లు వేస్తున్నారు. 150 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగింది. 
► తొలివిడతగా 621 గ్రామాల్లో సమగ్ర భూసర్వే చేపడుతున్నారు. 
► రూ.700 కోట్లతో ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం ప్రాజెక్టు చేపడుతున్నారు. 
► మార్పు పథకం కింద 18 వసతి గృహాల్లో రూ.కోటి 75 లక్షలతో కొత్త హంగులు సమకూర్చింది. 

పిల్లల భవిష్యత్‌కు పునాది  
నాడు–నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. గతంలో అక్కడ చదువులు సాగవనే భయం ఉండేది. నేడు ఆ భయంలేదు. శుభ్రమైన మరుగుదొడ్లు, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన, శుచికరమైన మధ్యాహ్నం భోజనం, కొత్త బెంచీలు, భవనాలన్నీ చాలా బాగున్నాయి. అమ్మఒడితో పిల్లల భవిష్యత్‌కు జగనన్నే భరోసా కల్పించారు.     
– జె. అనూరాధ, రణస్థలం

వారం రోజుల్లో బియ్యం కార్డు
మా బియ్యం కార్డులో మా పిల్లల పేర్లు లేవు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా ఫలితంలేదు. ఇప్పుడు మా వలంటీర్‌కి సమస్య చెప్పాం. వారం రోజుల క్రితం వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త కార్డు ఇచ్చారు. ఇంత వేగంగా కార్డు రావడాన్ని నమ్మలేకపోతున్నా.    
    – గేదెల గౌరమ్మ, ఉణుకూరు, రేగిడి మండలం

అడగ్గానే అడంగల్‌
గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చినా పెద్దగా నమ్మకం కలగలేదు. ఈ రోజు వచ్చి ఇలా 1బి గురించి అడిగానో లేదో వెంటనే తీసి ఇచ్చారు. నిజంగా ఇదొక అద్భుతమైన పాలన. గతంలో అడంగల్‌ నిమిత్తం ఎక్కడెక్కడో తిరిగాను. ఫలితం కనిపించలేదు.     
    – బొక్కేల తిరుపతిరావు, పోరాం గ్రామం, రేగిడి మండలం

ఎంతో మందికి ఉద్యోగాలు
సీఎం  జగన్‌ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలిచ్చారు. ఈ వ్యవస్థ ఇలానే కొనసాగితే ప్రజలు మంచి సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చు.      
– గార శ్రీకాంత్, బీటెక్, మందరాడ, సంతకవిటి మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement