అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
సాక్షి, అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి అధికారి పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వర్షాల కారణంగా శనివారం ఓర్వకల్లు పర్యటను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు సమాచారం అందిందని అధికారులు వెల్లడించగా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం సూచించారు.
విజయవాడలో కొండ చరియలు విరిగి పడటంతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆదివారం కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బుడమేరు ఆక్రమణలతో ముంపు ముప్పు నెలకొందని అధికారులు తెలియచేయడంతో సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికతో రావాలని సూచించారు. భారీ వర్షాలు పడే చోట్ల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు.
ప్రాణనష్టం లేకుండా చూడండి: హోం మంత్రి అనిత
భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాణనష్టం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా తదితర అధికారులతో కలిసి స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి శనివారం రాష్ట్రంలోని పరిస్థితుల్ని పర్యవేక్షించారు.
కూటమి శ్రేణులు సాయంగా నిలవాలి: పవన్‌కళ్యాణ్
రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం కె.పవన్‌కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ, వాతావరణ హెచ్చరికలను పాటిస్తూ జాగ్రత్తలు వహించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారులకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, శ్రేణులు సాయంగా ఉండాలన్నారు. విజయవాడలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో నలుగురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిమ్మల
భారీ వర్షాలు, వరదల విషయంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని బేరీజు వేసుకుని ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు.
వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సత్యకుమార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నందున ప్రజల ఆరోగ్యం పట్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. అమెరికాలో ఉన్న మంత్రి శనివారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
వైద్య ఆరోగ్యశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రాష్ట్రంలో వరద, తుపాను నేపథ్యంలో అత్యవసర వైద్య సేవల కోసం వైద్య ఆరోగ్యశాఖ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నెంబర్ 9032384168, మెయిల్ edidemics.apstate@gmail.com, అడిషినల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి 7386451239, స్టేట్ హెల్త్ ఆఫీసర్ ఎంవీ పద్మజ 8374893549 సమాచారం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment