సాక్షి, ఏలూరు: తమ్మిలేరులో తాను ఇసుక తవ్వినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ అధినేత, శాసన సభా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించి తనపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
దెందులూరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే లండన్ నుంచి వచ్చా. నిజయోకవర్గానికి చెందిన యువతకు వేలాది ఉద్యోగాలు ఇప్పించా. అయినా చంద్రబాబు నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.కానీ, చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
దెందులూరులో రూ.1,700 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ప్రగతి యాత్రలో(మంగళవారం) అదే విషయం మేం చెప్పాం. కానీ, ప్రతిపక్ష పార్టీ మితిమీరి విమర్శలు చేస్తోంది. అయినా మీ హయాంలో చేసిన ఒక్క మంచిపని చెప్పండి అంటూ బాబుకు సవాల్ విసిరారు అబ్బయ్య చౌదరి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినే అని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు.
‘‘ఈ మూడున్నరేళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన తొంభై శాతం హామీలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరవేర్చారు. కానీ, మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనత చంద్రబాబుది. సీఎంగా వైఎస్ జగన్.. ఎన్నో అభివృద్ధి .. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారని, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చేశార’’ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. అలాగే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి.. కనీసం నాలుగు లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. అదే సీఎం జగన్.. ఈ మూడున్నరేళ్లలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు.
ఏపీలో రైతులు పండించిన ప్రతీ గింజను కొనేలా చేసిన వ్యక్తి వైఎస్ జగన్. మరి 44 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతులను పట్టించుకున్నావా? అంటూ చంద్రబాబును నిలదీశారు. డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కానీ, డ్వాక్రా మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం మా ప్రభుత్వం పై బురద చల్లాలనీ చూస్తున్నాయి. అది చూసి రాష్ట్ర ప్రజలు అంతా ‘బాబూ.. మాకు ఈ కర్మ ఏమిట’ని అనుకుంటున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని.. అర్హులకు సంక్షేమం అందుతోంది గనుకే ధైర్యంగా ఓటేయమని అడుగుతున్నామని అబ్బయ్య చౌదరి తెలిపారు.
ఓటమి భయం తో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఇసుక మాఫియాకు పాల్పడింది చింతమనేని కాదా? అని నిలదీసిన అబ్బయ్య చౌదరి.. వచ్చే ఎన్నికల్లో ఫలితంతో చింతమనేనిని కూడా తన వెంట హైదరాబాద్‌కు చంద్రబాబు తీసుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment