ఒంగోలు టౌన్/చీరాల/మేదరమెట్ల/నగరంపాలెం/ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు గుంటూరులో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈగా పని చేస్తున్న చెంచు ఆంజనేయులు ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో గుంటూరు, ఒంగోలు, బాపట్ల జిల్లా మేదరమెట్ల, వేటపాలెం మండలం కొత్తపేట, కొరిశపాడు మండలం దైవాలరావూరు గ్రామాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఒంగోలులో ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఈ సోదాల వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఒంగోలులో జీ ప్లస్ త్రీ హౌసింగ్ కాంప్లెక్స్, ఒక ప్లాటు, కొప్పోలులో 8 ఇళ్ల స్థలాలు, చీరాలలో ఒక జీ ప్లస్ వన్ భవనం, రెండు స్థలాలు, కడవకుదురు వద్ద 1.9 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రూ.53 లక్షల సేల్‌డీడ్ పత్రాలు లభించినట్లు తెలిపారు. కిలో బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్‌లు ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ధరల మేరకు ఆస్తుల విలువ రూ.2.81 కోట్లు ఉన్నట్లు తేలిందన్నారు. ఆంజనేయులును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చెప్పారు.
ఎస్‌ఈబీ సీఐ ఇళ్లల్లో రూ.కోటి విలువైన అక్రమాస్తుల గుర్తింపు
శ్రీకాకుళం జిల్లా పొందూరులో లంచం తీసుకుంటూ దొరికిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.కోటి విలువైన అక్రమాస్తులను గుర్తించారు. విశాఖలోని విశాలాక్షినగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు ఇంటితోపాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలిలోని ఆయన బంధువుల ఇంట్లోనూ సోదాలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఎస్‌ఈబీ సీఐగా పనిచేసిన శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ ఈ నెల 7న ఏసీబీకి దొరి కారని తెలిపారు. అప్పటి నుంచి ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారని చెప్పారు. గతంలో పాడేరు ఎస్‌ఐగా పనిచేస్తున్న కాలంలోనూ ఆయన గంజాయి కేసులో ఏ8 నిందితుడిగా పట్టు బడి ఏడాది జైలు శిక్ష అనుభవించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment