సమావేశంలో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
సాక్షి, అమరావతి: కోవిడ్–19 మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. గురువారం విజయవాడలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో విద్యా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 97.5 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ జరగ్గా, మిగిలిన 7,388 మందికి కూడా వ్యాక్సిన్ అందించి నూరు శాతం లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు.
వర్సిటీలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు తమ సిబ్బందికి, విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ వేయించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 22 లక్షల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, వంద మందికి ఒకే చోట వ్యాక్సిన్ వేసేందుకు వీలుగా సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉన్నత విద్యా మండలి కమిషనర్ పోలా భాస్కర్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ రామకృష్ణ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్ష డైరెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment