ఫైల్ ఫోటో
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఈ నెల అయిదవ తేదీ వరకు అమ్మఒడిలో మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమ్మఒడి మార్పులు, చేర్పులకు 5వ తేదీ వరకు గడువు పొడగిస్తున్నామన్నారు. జనవరి 9న అమ్మఒడి రెండవ విడత కార్యక్రమానికి సిద్దమవుతున్నామని, అర్హులందరికి మరో అవకాశం ఇస్తున్నామన్నారు. 6వ తేదీన అమ్మఒడి అర్హుల జాబితా ప్రకటిస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకి అమ్మఒడి ఇవ్వడం లేదంటూ ఎల్లో మీడియా పత్రికలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్ఫష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికులందరికి అమ్మ ఒడి ఇస్తామని, గతేడాది 43 లక్షల మంది తల్లుల ఖాతాలకు అమ్మఒడిని అందించామని తెలిపారు. గతేడాది అమ్మఒడి కోసం 6450 కోట్లు ఖర్చు చేశామని, సడలించిన నిబంధనలతో ఈ సారి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు.
కోవిడ్ కారణంగా ఈ సారి 75 శాతం అటెండెన్స్ నిబంధన తొలగించామని, గతేడాది అమ్మఒడి అందిన అందరూ రెండవ విడతకి అర్హులేనని చెప్పారు. గతంలో గ్రామీణ స్ధాయిలో 5 వేలు నెలసరి ఆదాయం ఉన్నవారే అర్హులు కాగా ఈ సారి 10 వేల రూపాయలకు పెంచామని, పట్టణ ప్రాంతాలలో లబ్దిదారుల నెలసరి ఆదాయం రూ. 6250 నుంచి 12 వేల రూపాయిలకి పెంచామన్నారు. గత సంవత్సరం నెలకి 200 యూనిట్లు విద్యుత్ వాడేవారు అర్హులు కాగా.. ఈ సారి 300 యూనిట్లకు పెంచామని చెప్పారు. ఈ సడలించిన నిబంధనలతో అమ్మఒడి రెండవ విడత లబ్దిదారులు తప్పనిసరిగా పెరుగుతారని, వాస్తవాలు వక్రీకరించేలా పచ్చ పత్రికలు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని, అర్హులైనని ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా నెల్లూరులో రెండవ విడత అమ్మఒడి కార్యక్రమం కూడా చేపట్టాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment