సాక్షి, అమరావతి : సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆయన తన వ్యక్తిగత కక్షతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. అంతేకాక.. తన గురించి అనేక వాస్తవాలను తొక్కిపెట్టి ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యం రిట్, పిల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు.
తనపై కేసుల గురించి కనీస స్థాయిలో కూడా ఆయన ప్రసా్తవించలేదన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదు గురించి, జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ముందున్న కోర్టు ధిక్కార ప్రోసీడింగ్స్‌ను కూడా తన వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. పైపెచ్చు తనపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేవంటూ డిక్లరేషన్ కూడా ఇచ్చారని ఏజీ శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అసలు రఘురామ చట్ట నిబంధనల గురించి తెలియని అమాయకుడేమీ కాదన్నారు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయన బాగా తెలుసన్నారు.
అలాగే, కోర్టుల్లో జరిగే కేసుల విచారణలపై వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకు తెలుసునని తెలిపారు. పైగా ఆయన పార్లమెంట్ సభ్యుడని, అలాంటి వ్యక్తికి చట్ట నిబంధనల గురించి తెలియకపోవడానికి ఏముంటుందని శ్రీరామ్ చెప్పారు. అన్నీ తెలిసే ఆయన ఉద్దేశపూర్వకంగా తనకు సంబంధించిన కీలక విషయాలను పిటిషన్‌లో బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారని కోర్టుకు వివరించారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారం చేయడాన్నే రఘురామకృష్ణరాజు పనిగా పెట్టుకున్నారన్నారు.
కోర్టులు ఒకవైపు కేసులను విచారిస్తుంటే మరోపక్క ఆయన మీడియా ముందు ఆ కేసుల గురించి మాట్లాడటమే కాక, వ్యక్తులపై విషం చిమ్ముతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారని ఏజీ వివరించారు. ఆయన పలు మీడియా ఛానెళ్లతో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ పెద్దల గురించి మాట్లాడిన మాటల తాలూకు వీడియోలను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. ఆ వీడియాలను తమ కౌంటర్‌తోపాటు జతచేశామని తెలిపారు.
వాటిల్లో మాట్లాడిన మాటలను యథాతథంగా కౌంటర్‌లో పొందుపరిచామన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. ఈ వీడియోలను తాము ఇంటి వద్ద చూస్తామని, కౌంటర్‌లో రాసిన అంశాలను చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
సంక్షేమ పథకాల నిర్ణయాలపై పిల్..
రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతోపాటు వాటివల్ల పలువురికి లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రఘురామ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని విచారణార్హతపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం లేవనెత్తింది. దీంతో ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులందరినీ ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేశారు. తాజాగా.. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. రఘురామ దురుద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని, ఇలాంటి వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు.
అడ్వొకేట్ జనరల్‌గా తాను కోర్టులకు సహకరిస్తుంటానని, తాను మొదట కోర్టు ఆఫీసర్‌నని, తనపై కూడా ఆయన నిందారోపణలు చేశారని తెలిపారు. ఆ వీడియోలనూ పరిశీలించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.
విచారణార్హతపై వాదనలకే పరిమితం కావాలి
అంతకుముందు.. రఘురామ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు నాయకులంటే ఎలా ఉండాలో వివరించడం మొదలుపెట్టారు. ధర్మాసనం ఆయన్ను వారిస్తూ, కేసు గురించి వాదనలు చెప్పాలని స్పష్టంచేసింది. దీంతో సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందుకే తాము ఈ పిల్ దాఖలు చేశామన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment