IOT: వ్యవసాయాన్ని శాసించనున్న ఐఓటీ | Agriculture Scientists Says Future Farming Depends On Internet Of Things | Sakshi
Sakshi News home page

IOT: దిగుబడుల పెంపునకు కృత్రిమ మేధస్సు 

Published Wed, Nov 10 2021 8:17 AM | Last Updated on Wed, Nov 10 2021 2:35 PM

Agriculture Scientists Says Future Farming Depends On Internet Of Things - Sakshi

సాక్షి, అమరావతి: భవిష్యత్‌లో వ్యవసాయాన్ని శాసించేది శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) విధానాలేనని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఉత్పత్తి వ్యయాన్నీ తగ్గించడానికి, పర్యావరణ పరిరక్షణకు వ్యవసాయంలోనూ నాలుగు ఆర్‌ (ఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌)లు సరైన స్థలం (రైట్‌ ప్లేస్‌), సరైన సమయం (రైట్‌ టైం), సరైన ఉత్పాదకాలు (రైట్‌ ఇన్‌పుట్స్‌), సరైన మొత్తం (రైట్‌ ఎమౌంట్‌) ప్రధాన పాత్ర పోషించనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

సరైన డేటా ఉన్నప్పుడే..  
సాంకేతికత, పర్యావరణ డేటాను ఉపయోగించడం, కచ్చితమైన వ్యవసాయానికి, స్థిరత్వానికి చాలా ముఖ్యం. 2020–21 ఆర్థిక సర్వే ప్రకారం జీడీపీలో వ్యవసాయం వాటా 19.9 శాతం. అంతకుముందటేడాది 2019–20తో పోలిస్తే ఇది 2.1% ఎక్కువ. దేశ వ్యవసాయ రంగాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టినా ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలతో ఇది సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో ఇదంతా భాగం.  2050 నాటికి పంట ఉత్పత్తిని 60 నుంచి 100 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

భవిష్యత్‌ ఆహార అవసరాలను తీర్చడానికి శాస్త్రవేత్తలు ప్రధానంగా  అగ్రిబిజినెస్‌పై ఆధారపడుతున్నారు. అందుకే వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను, కృత్రిమ మేధస్సును జోడిస్తున్నారు. సమీపభవిష్యత్‌లో వ్యవసాయ ఉత్పాదకతను ఇంటర్నెట్‌ సంబంధిత వ్యవహారాలు (ఐఓటీ), ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, వెబ్‌ ఆధారిత జియో ట్రాకింగ్‌ పద్ధతులు, కృత్రిమ మేధస్సు, బిగ్‌ డేటా, క్లౌడ్, మెషిన్‌ లెర్నింగ్‌ వంటివి శాసిస్తాయని, దిగుబడులను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు. 

డేటా పరిరక్షణ పెద్ద సమస్యే.. 
సాగు రంగ సమాచారాన్ని సేకరించడం ఒక ఎత్తయితే దాన్ని కాపాడడం, ఉపయోగించుకోవడం మరో ఎత్తు. పెద్దఎత్తున ధనంతో ముడిపడిన సమస్య. వ్యవసాయ రంగానికి భారీఎత్తున నిధులు కేటాయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. తొలిదశలో భూమి, నీటి సంరక్షణపై దృష్టి సారించింది. టాటా కిసాన్‌ కేంద్రం (టీకేకే), ఫసల్‌ వంటి కంపెనీలు ఇప్పటికే దేశంలో సాంకేతిక సహకారంతో సమాచారాన్ని సేకరించి కచ్చితమైన వ్యవసాయ విధానం వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.  

డేటా సేకరణ ఎవరి కోసం? 
ఈ డేటా సేకరణ ఎవరి కోసం అనేదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వైపు వ్యవసాయాన్ని నడిపించేందుకు ఈ డేటా పనికి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతు సంఘాలు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నాయి. చిన్న సన్నకారు రైతులకు ఈ డేటాలు, సాంకేతికత పనికి రాదని, చిన్నకమతాలను దృష్టిలో పెట్టుకుని సాంకేతికతను తయారు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇలా చేయాలంటే కూడా సమాచారం అవసరం అని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు.

వ్యవసాయంలో నాలుగు ఆర్‌లు.. 
ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫెర్టిలైజర్స్‌ ప్రకారం, ఖచ్చితమైన వ్యవసాయం ప్రాథమికంగా నాలుగు ఆర్‌లపై ఆధారపడి ఉంది. అవి.. ’సరైన సమయంలో’ ’సరైన ఇన్‌పుట్‌’ ’సరైన స్థలం’ ’సరైన వ్యయం’ (మొత్తం). వీటితో పాటు ఉత్పాదకతను మెరుగుపరచడానికి ’సరైన పద్ధతి’ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కోరుకున్న ఫలితాల సాధనకు పెద్దఎత్తున సమాచారాన్ని క్రోడీకరించాలి. సాంకేతికతను అన్వయించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే మెరుగైన వ్యవసాయ పద్ధతులకు శ్రీకారం చుట్టారు. మనలాంటి దేశాలలో ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇది సాగురంగంలో సానుకూల మార్పును ప్రభావితం చేయనుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement