తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
రాష్ట్రంలో జూన్ 1 నాటికి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ప్రారంభం కావాలి. అప్పటికి ఈ వ్యవస్థ సజావుగా నడిచేలా చూడాలి. ఇందుకోసం జనతా బజార్లు, గ్రామ స్థాయిలో కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, కంటైనర్ వాహనం, మార్కెటింగ్ యార్డుల్లో గ్రేడింగ్.. ప్యాకింగ్ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, ఆక్వా ప్రాంతాల్లో ఇండివిడ్యువల్ క్విక్ ఫ్రీజింగ్ సదుపాయాలు ఏర్పాటు కావాలి. – సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులు పండించిన పంటలకు కచ్చితంగా సరైన ధర లభించాల్సిందేనని, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా రైతు పండించిన పంటకు సరైన ధర లభించలేదంటే.. మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా కచ్చితంగా అలర్ట్ రావాలని, అలా అలర్ట్ వచ్చే పరిస్థితి వెబ్‌సైట్లో ఉండాలన్నారు. రైతులను ఆదుకునే వినూత్న విధానాలు, వ్యవస్థల కార్యాచరణ ప్రణాళిక.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాల్సిన పనులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్ని నిధులైనా సరే ఒకసారి ఖర్చు చేసి.. వ్యవసాయ రంగాన్ని పట్టాల మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేద్దామని, దీనికి తోడు ధరల స్థిరీకరణ నిధి రైతులకు అండగా నిలబడుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి.
మార్కెట్ వికేంద్రీకరణను ఉపయోగించుకోవాలి
►కోవిడ్–19 కారణంగా ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకు రావడానికి కొన్ని మార్కెట్లను వికేంద్రీకరించాం. వీటిని పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి.. భవిష్యత్తులో కూడా వాటిని నిర్వహించేలా చూడాలి.
►ప్రస్తుతం గుర్తించిన దుకాణాలకు భవిష్యత్తులో కూడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు పంపి ణీ చేస్తే.. దీని వల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగు తుంది. రైతుల ఉత్పత్తులను ప్రజల ముంగిటకే తీసు కెళ్లడానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది.
►ఎక్కడైనా రైతు పండించిన పంటకు సరైన దర లభించలేదంటే.. మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా కచ్చితంగా అలర్ట్ రావాలి. అలా అలర్ట్ వచ్చే పరిస్థితి వెబ్‌సైట్లో ఉండాలి. అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి సమాచారం రాగానే 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి.
►ప్రతిరోజూ అగ్రికల్చర్ అసిస్టెంట్లు తమ గ్రామంలోని పంటలు, ఉత్పత్తులు, వాటి ధరలపై సమాచారాన్ని ట్యాబ్ ద్వారా నిరంతరం యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
ప్రతి ఆర్‌బీకేలో కంటైనర్ వాహనం
►ప్రతి రైతు భరోసా కేంద్రంలో కంటైనర్ వాహనాన్ని ఉంచడం ద్వారా రైతుల ఉత్పత్తులను తరలించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏర్పాటు చేయదలుచుకున్న జనతా బజార్లకు కావాల్సిన నిత్యావసరాలు, వస్తువులను తీసుకురావడానికీ పనికొస్తుంది.
►రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్దే గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి.. ఇతర మార్కెటింగ్ వ్యవస్థల్లోకి, జనతా బజార్లకూ తరలించవచ్చు. ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా నడపడానికి నిర్దిష్టమైన ఎస్‌ఓపీలను రూపొందించుకోవాలి. దీనికి సంబంధించి ప్రొటోకాల్ తయారు చేసుకోవాలి.
►ఈ అంశాలన్నింటిపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో దృష్టి పెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలు, గోదాముల అంశంలో స్వయం సమృద్ధి సాధించాలి.
Comments
Please login to add a commentAdd a comment