కొప్పర్తిలో ఏఐఎల్‌ డిక్సన్‌ ఉత్పత్తి షురూ! | AIL Dixon production started in Kopparthi | Sakshi
Sakshi News home page

కొప్పర్తిలో ఏఐఎల్‌ డిక్సన్‌ ఉత్పత్తి షురూ!

Published Sun, Jul 2 2023 4:31 AM | Last Updated on Sun, Jul 2 2023 3:34 PM

AIL Dixon production started in Kopparthi - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌  (వైఎస్సార్‌ ఈఎంసీ)లో ఏఐఎల్‌ డిక్సన్‌ కంపెనీ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవుతోంది. ఈ సంస్థ రూ.127 కోట్లతో భద్రత కోసం వినియోగించే సీసీటీవీ, ఐపీ కెమెరాలు, డిజిటల్‌ వీడియో రికార్డుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. గత నెల రోజుల నుంచి ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని ప్రారంభించిన ఏఐఎల్‌ డిక్సన్‌ త్వరలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏఐఎల్‌ డిక్సన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సీపీ ప్లస్‌ బ్రాండ్‌ పేరున్న సీసీ కెమెరాలను ఉత్పత్తి చేయనుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఇంటెలిజెంట్‌ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ వెర్టికల్‌ సరై్వవ్‌లెన్స్‌ కెమెరాలను తయారుచేస్తుంది.

ఆదిత్య ఇన్ఫోటెక్‌తో కలిసి డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. ఈ నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ యూనిట్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఎల్రక్టానిక్‌ ఐటీ ఏజెన్సీ(అపిటా) గ్రూప్‌ సీఈవో ఎస్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.  

మరో రెండు తయారీ యూనిట్లు.. 
దుబాయ్‌కి చెందిన ప్రముఖ ఎల్రక్టానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ.. ఎలిస్టా కొప్పర్తిలో టెక్నోడోమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి ఎల్‌ఈడీ టీవీలు, ఎల్రక్టానిక్‌ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. సుమారు 2.95 ఎకరాల విస్తీర్ణంలో రూ.52 కోట్ల వ్యయంతో దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులను మిడిల్‌ ఈస్ట్, ఆఫ్రికా, కామన్‌వెల్త్‌ దేశాలకు ఎగుమతి చేస్తుంది.

అలాగే వర్చువల్‌ మేజ్‌ సాఫ్ట్‌సిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ బ్యాటరీల తయారీ, జీపీఎస్‌ ట్రాకర్, స్మార్ట్‌ పీసీబీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 7.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.71.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌ ద్వారా 1,350 మందికి ఉపాధి లభించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులకు కూడా సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణ పనులు మొదలైన 24 నెలల్లోగా ఉత్పత్తిని ప్రారంభించే విధంగా కంపెనీలు ప్రణాళికలు సిద్ధం 
చేసుకుంటున్నాయి. 

రూ.749 కోట్లతో వైఎస్సార్‌ ఈఎంసీ అభివృద్ధి 
ఎల్రక్టానిక్‌ ఉత్పత్తుల తయారీ కోసం వైఎస్సార్‌ ఈఎంసీని 801 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిదశలో 540 ఎకరాలు, రెండో దశలో 261 ఎకరాలు అభివృద్ధి చేయనున్నాం. తొలిదశలో రూ.749 కోట్లతో వైఎస్సార్‌ ఈఎంసీని అభివృద్ధి చేశాం.

సుమారు రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా సుమారు 28,250 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ఆరు యూనిట్లకు సుమారు 30 ఎకరాల వరకు కేటాయించాం. రానున్న కాలంలో  ఎల్రక్టానిక్‌ తయారీ హబ్‌గా కొప్పర్తి కొత్తరూపు సంతరించుకోనుంది.  – కోన శశిధర్, ఐటీ శాఖ కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement