సాక్షి, విజయవాడ : దేశంలో ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలిపారు. రైతుల బాధలను చూసే వైఎస్సార్ ఉచిత విద్యుత్, జలయజ్ఞం చేపట్టారన్నారు. ఆయన మాట్లాడుతూ.. తండ్రి చేపట్టిన సంస్కరణలను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. విద్యుత్ సరఫరాను 7 నుంచి 9 గంటలకు పెంచారని, ఫీడర్ల సమస్యకు వెంటనే నిధులు మంజూరు చేశారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిల కింద రూ.7,171 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాం నాటి బకాయిలు చెల్లిస్తూ ముందుకెళ్తున్నామని, గత ప్రభుత్వం వదిలేసిన విద్యుత్ బకాయిల్లో రూ. 14,023 కోట్లు చెల్లించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 12శాతం అదనపు విద్యుత్ ఉత్పత్తి ఉందని ఆయన పేర్కొన్నారు. (పేదల పెన్నిధి.. సంక్షేమ సారథి డాక్టర్' వైఎస్సార్')
కేంద్రం డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ యాక్టును రాష్ట్రాలకు అందజేసిందని, రైతులకు ఉచిత విద్యుత్ అందించే రాష్ట్రాలు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం చట్టం చేయబోతోందని అజేయ కల్లం వెల్లడించారు. ఒకవేళ అదనంగా రుణాలు తీసుకోవాలంటే కొన్ని సంస్కరణలు చేపట్టాలని కేంద్రం నిబంధన పెట్టిందన్నారు. నగదు బదిలీ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వానికి దమ్ముండాలని, తమ లాంటి వారందరం ఇది అమలు కష్టమని చెప్పినట్లు తెలిపారు. కానీ సీఎం జగన్ దీనిని ఓ ఛాలెంజీగా తీసుకున్నారన్నారు. దేశంలోనే తొలిసారిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కరెంట్ సబ్సిడీ నిమిత్తం రూ. 17,904 కోట్లు ఖర్చు పెట్టామని, గత ప్రభుత్వం వీటిల్లో సగం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రూ. 7130 కోట్లు ఫీడర్ల ఆధునికీకరణ కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించిన అజయ్ కల్లం గత ప్రభుత్వ బాకీలను తీరుస్తూ.. విద్యుత్ వ్యవస్థను సంస్కరిస్తూ వస్తున్నామన్నారు. (‘వైఎస్సార్ పాలనలో లబ్ధి పొందని గడప లేదు’)
‘1994-2004 మధ్య తీవ్ర వర్షాభావ పరిస్థితిలు ఉండేవి. 1997-98 ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు నేరుగా బిల్లులు చెల్లిస్తే నాణ్యమైన విద్యుత్తును డిమాండ్ చేసే హక్కు వస్తుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉచితంగానే చేస్తాం. ఉచిత విద్యుత్ అనేది యధావిధిగా అమలు అవుతుంది. సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం. రైతుల కోసమే కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు. ఉచిత విద్యుత్ సబ్సిడీని నగదు బదిలీ రూపంలో రైతులకు అందచేస్తున్న తొలి సీఎం జగనే కావడం గర్వకారణం. ఇది రైతుల మంచి కోసం చేసిన నిర్ణయమే. ఇప్పుడు మీటర్లు పెట్టి భవిష్యత్తులో ఏదో చేస్తామనే ఆందోళన అనవసరం. చెప్పిందొక్కటి.. చేసేదొకటి ఎవరో.. రైతులపై కాల్పులు జరిపేది ఎవరో అందరికీ తెలుసు. వ్యవసాయ కనెక్షన్ల పేరుతో ఎవరైనా దుర్వినియోగం చేస్తే అది బయటపడుతోంది.రైతు ఖాతాల నుంచి ఆటో డెబిట్ పద్దతిన డిస్కంలకు చెల్లింపులు జరుగుతాయి. రైతు ఎక్కడా రూపాయి కట్టాల్సిన పనిలేదు. ఇది ఎవర్నీ మోసం చేయడానికి కాదు. రైతులకు ఒక్క రూపాయి అదనపు భారం కాదు.’ అని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలిపారు. (చిన్నారికి సీఎం దంపతుల ఆశీర్వాదం)
Comments
Please login to add a commentAdd a comment