
సాక్షి, కృష్ణా జిల్లా: దళిత పారిశ్రామికవేత్త లక్ష్మీ నరసింహన్ ఆరోపణలపై డీఎస్పీలు సత్యానందం, షేక్ అబ్దుల్ అజీజ్ స్పందించారు. మంగళవారం డీఎస్పీ సత్యానందం మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీ నరసింహన్ పోలీసులపై చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. ‘‘నందివాడ మండలం తమిరిస గ్రామంలో లక్ష్మీ నరసింహన్ 147 ఎకరాల రొయ్యల చెరువు సబ్ లీజుకు తీసుకొని సాగు చేస్తోంది. మచిలీపట్నం, గుడివాడ పరిధిలో లక్ష్మీ నరసింహన్ ఆర్థిక లావాదేవీల అవకతవకలపై ఫిర్యాదులు విచారణ దశలో ఉన్నాయి. 2018లో మచిలీపట్నం పరిధిలో పలువురిపై కేసు పెట్టిన లక్ష్మీ నరసింహన్ తాను ముదిలియార్ కులానికి చెందినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. (చదవండి: చెమ్మచెక్క ఆడుతున్నావా? మంత్రి అనిల్ ఫైర్)
గత అక్టోబర్‌లో నూకల రామకృష్ణ, అతని కుమారుడు బాలాజీ కులం పేరుతో దూషించారని ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాం. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మహిళా పోలీస్ డీఎస్పీ ఆధ్వర్యంలో చట్ట ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం. విచారణ జరుగుతుండగానే తన చెరువులో 150 టన్నుల రొయ్యలను దొంగిలించినట్లు మరో ఫిర్యాదు చేసింది. లక్ష్మీ నరసింహన్ ఇచ్చిన రెండో ఫిర్యాదు పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆధారాలు లేకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదని’’ ఆయన వివరణ ఇచ్చారు. (చదవండి: మాట తప్పడమే బాబు నైజం!)
చట్ట ప్రకారం విచారణ జరుగుతుంది..
మహిళా పోలీస్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహన్, నూకల రామకృష్ణకు చెరువు సబ్ లిజ్ సొమ్ము తో పాటుగా, ఆరు లక్షల కరెంట్ బిల్లులు బకాయిలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. 20 టన్నుల రొయ్యలను, తన బకాయిగా జమ చేసుకొని రామకృష్ణ తీసుకెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు. సంబంధం లేని ఇతర ఆర్థిక లావాదేవీల కేసులను నూకల రామకృష్ణ కేసుతో ముడి పెట్టడం వల్ల విచారణ ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. పోలీసులపై లక్ష్మీనరసింహన్ చేసిన వాఖ్యలు పూర్తి నిరాధారం. ఆమె చేసిన రెండు ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరుగుతుందని, ఆమె పై వచ్చిన ఫిర్యాదులపై కూడా విచారణ జరుగుతుందని డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment