పాదయాత్రను ఆద్యంతం దగ్గరుండి నడిపిస్తున్న పత్తిపాటి పుల్లారావు, శ్రావణ్ కుమార్, దేవినేని ఉమా, పలువురు టీడీపీ నేతలు
తాడికొండ: అమరావతి రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట సోమవారం నిర్వహించిన మహా పాదయాత్రలో అడుగడుగునా హైకోర్టు పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించారు. కోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు 157 మందికే అనుమతులు ఇవ్వగా.. అందుకు భిన్నంగా వేలాది మంది టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో చేరారు. కరోనా నిబంధనలను సైతం పాటించకుండా పాదయాత్రలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు శివాలయంలో పూజల అనంతరం ప్రారంభమైన పాదయాత్ర తాడికొండ వరకు కొనసాగింది.
రైతుల పేరుతో గుంటూరు, విజయవాడ, ఇతర గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు గుంపులుగా చేరారు. డీజేలు, తీన్మార్లు లేకుండా, రెచ్చగొట్టే ప్రసంగాలు లేకుండా పాదయాత్ర నిర్వహించుకోవాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు ఆద్యంతం పాదయాత్రను దగ్గరుండి మరీ నడిపించారు.
టీడీపీ నేతలు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, పోతినేని శ్రీనివాసరావు, గద్దె అనురాధ, సీపీఐ నారాయణ, బీజేపీ నేత పాతూరి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ నేత సుంకర పద్మశ్రీ తదితరులు పాదయాత్రలో పాల్గొనడం గమనార్హం. అమరావతి జేఏసీ నేతలు టీడీపీ నేతలతో కలిసి రాత్రి బసకు తాడికొండలో ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment