కాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలి
సిట్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలు
కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. పోలింగ్ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్ ఇన్‌చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది.
టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తోపాటు వైఎసార్‌సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.
బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి చంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.
అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.
ప్రజాబలంతో ఎదుర్కోలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్
వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ బాబు కుట్రలకు దిగారు. ప్రజా మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
హక్కులు కాలరాశారు: రావెల కిషోర్ బాబు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment